ఎంప్లాయీస్,​ స్టూడెంట్లకు రోజూ తప్పని ఇబ్బందులు

ఎంప్లాయీస్,​ స్టూడెంట్లకు రోజూ తప్పని ఇబ్బందులు

 

  • మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్​ డివిజన్లలో సమస్యలు
  • ఎంప్లాయీస్,​ స్టూడెంట్లకు రోజూ తప్పని ఇబ్బందులు 
  • కాలనీల్లో రోడ్లపై పారే మురుగుతో భరించలేని దుర్వాసన
  • ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం
  • స్థానిక కాలనీవాసులతో కలిసి నిరసన తెలిపిన కార్పొరేటర్

గచ్చిబౌలి, వెలుగు: సిటీలో ఐటీ కారిడార్​కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్​డివిజన్లలోనే ఏర్పాటై ఉన్నాయి. ఆయా కంపెనీల్లో పనిచేసే వేలాదిమంది ఉద్యోగులు కూడా స్థానికంగానే ఎక్కువగా నివసిస్తుంటారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలోకి వచ్చే ఆయా డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ ప్రాబ్లమ్స్​అధికంగా ఉన్నాయి. వాటిపై కాలనీల వాసులు ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నా డివిజన్లు ఇంకా చాలా వెనుకబడే ఉన్నాయి. ఇటీవల ఓ కార్పొరేటర్​తన డివిజన్​లోని కాలనీలో డ్రైనేజీ సమస్యపై కాలనీవాసులతో కలిసి ఆందోళన చేయడంతో అధికారుల పనితీరు ఏంటో తెలుస్తోంది. 

60 శాతం మంది వరకు ఉంటుండగా..

శేరిలింగంపల్లి జోన్ చందానగర్​సర్కిల్ పరిధిలోని మాదాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్​పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి డివిజన్లలోనే ఐటీ కంపెనీలు ఏర్పాటై ఉన్నాయి. వీటిలో వర్క్​ చేసే ఎంప్లాయీస్​ 60 శాతం మంది వరకు ఆయా డివిజన్ల పరిధిలోని అపార్ట్​మెంట్లు, హాస్టళ్లలో ఉంటారు. అభివృద్ధి చెందినవిగా చెప్పుకునే డివిజన్లలో డ్రైనేజీ, సీసీ రోడ్ల ప్రాబ్లమ్స్​కూడా ఎక్కువే. దీంతో స్థానికులకు  ఇబ్బందులు తప్పడంలేదు. మాదాపూర్​హైటెక్స్​పక్కనే ఉన్న ఖానామెట్, ఇజ్జత్​నగర్, గుట్టుల బేగంపేటలో సరైన డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు లేవు. ఖానామేట్​ప్రభుత్వ స్కూల్​వెనకాల రోడ్డులో డ్రైనేజీ మ్యాన్​హోల్స్​ఎక్కువ ఎత్తులో నిర్మించగా వచ్చిపోయేవారికి ఇబ్బందులు వస్తున్నాయి. సొసైటీలో సీసీ రోడ్లు లేవు. దీంతో రోడ్లపై వెహికల్స్​వస్తూ పోతుంటే దుమ్ము లేచి ఇండ్లలోకి చేరుతోంది. కొండాపూర్​లోని అంజయ్యనగర్ లో అండర్​గ్రౌండ్​సీవరేజ్​పైప్​లైన్​నిర్మించి సీసీ రోడ్డు వేయలేదు. దీంతో బైక్​లు మట్టిలో దిగబడిపోయి బయటకు రాని పరిస్థితి నెలకొంది. మరోచోట డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతుండగా కంపును తట్టుకోలేక స్కూల్​కు వెళ్లే స్టూడెంట్స్, ఆఫీస్​లకు వెళ్లే ఉద్యోగులు ముక్కు మూసుకుని పోవాల్సి వస్తోంది. సిద్ధిక్​నగర్ లోనూ సీసీ రోడ్డు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువే. గచ్చిబౌలి డివిజన్​గోపన్​పల్లిలో డ్రైనేజీతో స్థానికులు, వాహన దారులు కష్టాలు తప్పడంలేదు. తెల్లాపూర్​వైపు రోడ్డు నిర్మాణం జరుగుతుండగా అండర్​గ్రౌండ్​సీవరేజ్ పైప్​లైన్​వేయగా, నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయట్లేదు. డ్రైనేజీ నీరంతా రోడ్లపై పారుతూ చెరువులా తయారైంది. స్థానికులు కంపు భరించలేకపోతున్నారు. ఈరోడ్డులో ప్రయాణించే వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులను కోరిన, అధికారులకు కంప్లయింట్​చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.