
- తెలంగాణ రాష్ట్ర జోగి కుల సంఘం
ముషీరాబాద్, వెలుగు: వనమూలికలు అంతరించిపోకుండా ప్రభుత్వం ఐదెకరాల స్థలం కేటాయించి వాటిని పెంచి ప్రోత్సహించాలని రాష్ట్ర జోగి కుల సంఘం డిమాండ్ చేసింది. అడవులు అంతరించిపోతుండగా వనమూలికలు అందుబాటులో లేకపోవడంతో జోగి కులవృత్తి అంతరించి పోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఆదివారం గ్రేటర్ బీసీ సాధికార భవన్ లో సమావేశానికి హాజరైన అధ్యక్షుడు ఎంఎస్ నరహరి మాట్లాడుతూ పూర్వకాలం నుంచి వస్తున్న జోగి కులవృత్తి వనమూలికలను సేకరించి సమాజానికి సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. నేడు ఆర్థిక వనరులు దెబ్బతినడంతో వనమూలికలు దొరకక దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జోగి కులం చిన్నదని కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కోసం రెండు వేల గజాల స్థలం కేటాయించి సిటీలో భవనం నిర్మించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మొదటి ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, శ్రీహరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.