మైనర్ల పోలీస్ కస్టడీకి జువైనల్ కోర్డు అనుమతి

మైనర్ల పోలీస్ కస్టడీకి జువైనల్ కోర్డు అనుమతి

హైదరాబాద్: జూబ్లీ హిల్స్ బాలిక కేసులో నిందితులుగా ఉన్న మైనర్లను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ జువైనల్ జస్టిస్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మైనర్లను కూడా కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు చేసిన అభ్యర్థనను జువైనల్ కోర్టు అంగీకరించింది. దీంతో ఈ నెల 10 నుంచి 14 వరకు ఐదురోజుల పాటు పోలీసుల విచారణ కొనసాగనుంది. మొత్తం 5 మంది మైనర్లలో ముగ్గురిని కష్టడీకి తీసుకోనుండగా... మిగతా ఇద్దరి కోసం జూబ్లీ హిల్స్ పోలీసులు పిటిషన్ వేశారు. న్యాయవాది సమక్షంలో మైనర్లను విచారణ చేసి వారి స్టేట్ మెంట్లను పోలీసులు రికార్డు చేయనున్నారు. అలాగే పోలీస్ యూనిఫామ్ లేకుండా విచారణ చేయాలని జువైనల్ కోర్డు ఆదేశించింది. పెన్ను పేపర్ తప్ప వేరే ఎలాంటి వస్తువులు విచారణ గదిలోకి తీసుకెళ్లొద్దని కోర్టు స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే  పోలీసుల నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వారి నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్ చేశారు. తప్పు చేసినవారు మైనర్లైనా సరే మేజర్లకు వేసినట్లే శిక్ష వేయాలని అభిప్రాయపడ్డారు.