
ప్రభుత్వ టీచర్లు తమ ఆస్తుల వివరాలు ఏటా సమర్పించాలంటూ జారీచేసిన ఆదేశాలపై కేసీఆర్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ ఆదేశాలను (ఆర్.సి.నంబర్.192-ఎస్టాబ్లిష్ మెంట్-1/2022) తక్షణమే నిలిపివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జీవో నిలిపివేత ఉత్తర్వులను వెంటనే జారీ చేయాలని విద్యా శాఖ కార్యదర్శిని మంత్రి సబిత ఆదేశించారు.
విజిలెన్సు శాఖ రిపోర్ట్ ఇవ్వడంతో..
అయితే, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం సంచలన జీవో జారీ చేసిన విషయం వెలుగుచూసింది. ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని వాటిలో పేర్కొన్నట్లు వెల్లడైంది. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులు ఆస్తి వివరాలు సబ్మిట్ చేయాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. స్థిర, చర ఆస్తులు అమ్మినా.. కొన్నా.. ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. విద్యాశాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్ మెంట్ సమర్పించాలని సూచించింది. టీచర్ లకు, ఉద్యోగులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్జేడీలు, డీఈవోలకు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా అనుమతి తీసుకున్న తర్వాతే..స్థిర / చర ఆస్తులు కొనుగోలు / అమ్మకాలు చేయాలని ఉద్యోగులను ఆదేశించింది. నల్గొండ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్సు శాఖ రిపోర్ట్ ఇవ్వడంతో విద్యాశాఖ ఈ జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది.