‘గ్రేటర్’ లీడర్ల మధ్య గ్యాప్​ నిజమే : తలసాని

‘గ్రేటర్’ లీడర్ల మధ్య గ్యాప్​ నిజమే : తలసాని
  • ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తే పార్టీకే నష్టం
  • విభేదాలు వీడి కలిసి ముందుకు సాగుతాం
  • 10 తేదీ లోపు సభ్యత్వాల లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​ హైదరాబాద్​ పార్టీ నేతల మధ్య కొంత గ్యాప్​ ఉన్న మాట నిజమేనని, మెంబర్​షిప్​ డ్రైవ్​లో వెనుకబడటానికి నేతల్లో సమన్వయం లేకపోవడం కూడా కారణమని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​ చెప్పారు. ఎవరికివారే అన్నట్టుగా వ్యవహరిస్తే కుదరదని, కలిసికట్టుగా ముందుకు వెళదామని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తనకు హైదరాబాద్​ మేయర్​తో సహా ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీఆర్ఎస్ సభ్యత్వాల టార్గెట్ ను ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేస్తామని తెలిపారు.

కేటీఆర్​ అసంతృప్తి నేపథ్యంలో..

సభ్యత్వ నమోదులో వెనుకబడటంతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం గ్రేటర్​ నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత వీక్ గా ఉంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదుపై మంత్రి తలసాని దృష్టి పెట్టారు. శుక్రవారం సనత్ నగర్, అంబర్ పేట్, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో రివ్యూ మీటింగ్ లు పెట్టి మెంబర్​షిప్​ డ్రైవ్​ను వేగవంతం చేయాలని కోరారు. తర్వాత ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్​లో మీడియాతో మాట్లాడారు. పదో తేదీ లోపు మెంబర్​షిప్​ టార్గెట్​ పూర్తిచేసి.. బూత్, డివిజన్ కమిటీలు వేస్తామని ప్రకటించారు. పదో తేదీన కార్యకర్తలు, నేతలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలతో జనరల్ బాడీ మీటింగ్ పెడతామని చెప్పారు

మేయర్​తో విభేదాల్లేవ్..

పార్టీలో మేయర్ తోనే కాదు ఎవరితోనూ తనకు విభేదాలు లేవని, అందరినీ కలుపుకొని వెళ్తున్నామని తలసాని అన్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో అందరికీ ఆహ్వానం ఉంటుందని, కొన్ని సందర్భాల్లో ఏవో కారణాలతో నేతలు రాలేకపోవచ్చని చెప్పారు. ఇటీవల రవీంద్ర భారతిలో జరిగిన ఆసరా పింఛన్ల పెంపు కార్యక్రమానికి, బోనాల జాతరకు స్వయంగా మేయర్ బొంతు రామ్మోహన్ ను ఆహ్వానించానని, వ్యక్తిగత కార్యక్రమాల కారణంగా ఆయన రాలేకపోయారని అన్నారు. అందరం పార్టీ కోసమే పనిచేస్తున్నామని, కానీ కొంత గ్యాప్ ఉన్న మాట వాస్తవమేనని చెప్పారు.