- బాధిత రైతులకు డిప్యూటీ సీఎం హామీ
హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కాలంలో భూమిలేని పేదలకు పంచిన భూములను తిరిగి అర్హులైన వారికే పంచుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ప్రగతి భవన్ లో మాజీ ఎమ్మెల్యే కిచెన్నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నాదర్గుల్ కస్రా రైతులు భట్టిని కలిశారు. ఇందిరమ్మ కాలంలో తమకు సంక్రమించిన అసైన్డ్ భూములను తప్పుడు జీపీఏలు, కోర్టు ఉత్తర్వుల ద్వారా కాజేసేందుకు కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారని భట్టికి రైతులు వివరించారు. తమ భూములను కాపాడాలని కోరారు. డిప్యూటీ సీఎం స్పందిస్తూ భూములు కాపాడతానని, సంబంధిత అధికారులకు లేఖ రాసి కావాల్సిన ప్రక్రియ ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.
