ఆఫ్గాన్‌ నుంచి వెళ్లిన చివరి అమెరికన్ సైనికుడు

ఆఫ్గాన్‌ నుంచి వెళ్లిన చివరి అమెరికన్ సైనికుడు

అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాల తరలింపు పూర్తి అయింది. చివరి అమెరికన్ సైనికుడు అఫ్గనిస్తాన్ ను విడిచిపెట్టినట్టు అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. నిన్న సాయంత్రం  C-17 ఎయిర్ క్రాఫ్ట్ లో మిగిలిన సైనికులంతా తరలివెళ్లినట్టు తెలిపింది. కాబూల్ లో US మిషన్ ముగిసిందని ట్విట్టర్ లో ప్రకటించింది. దాదాపు 20 ఏళ్ల పాటు అఫ్గన్ లో సాగిన తమ మిషన్ లో... 2వేల 461 మంది సైనికులను తాము కోల్పోయినట్టు అమెరికా తెలిపింది. అలాగే కొన్నివేల మంది గాయపడ్డారని వివరించింది. ఈసారి మొత్తంగా 6వేల మంది అమెరికన్లతో పాటు... లక్షా 23వేల మంది ఇతర దేశాల పౌరులను తాము అఫ్గనిస్తాన్ నుంచి తరలించినట్టు అమెరికా ప్రకటించింది. అందులో ఎక్కువ మంది అఫ్గన్ లతో పాటు... ఇతర మిత్రదేశాల పౌరులున్నారని వివరించింది. మొత్తంగా  ఈ నెల 31 లోపే తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్న సంకల్పాన్ని పూర్తి చేసింది అమెరికా.



అఫ్గన్ లో 20 ఏళ్ల అమెరికా మిలిటరీ ప్రెజెన్స్ ముగిసిందన్నారు అధ్యక్షుడు జో బైడెన్. అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత పెద్ద తరలింపు ప్రక్రియను గత 17 రోజులుగా చేపట్టినట్టు తెలిపారు. అఫ్గనిస్తాన్ నుంచి బలగాల తరలింపు కోసం తాను తీసుకున్న నిర్ణయంపై ఇవాళ మీడియాతో మాట్లాడనున్నట్టు బైడెన్ చెప్పారు. అఫ్గన్ నుంచి తమ బలగాల తరలింపు పూర్తైనప్పటికీ... ఇంకా అక్కడే మిగిలిపోయిన తమ పౌరుల కోసం ఎవాక్యుయేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందని అమెరికా వివరించింది. అప్గన్ ను వీడాలనుకుంటున్న ప్రతీ అమెరికన్ కు తాము సహకరిస్తామని స్పష్టం చేసింది. ఇక అఫ్గన్ లో దౌత్యసేవలు కూడా సస్పెండ్ చేసింది అమెరికా. ఖతార్ నుంచి సేవలు కొనసాగిస్తామని తెలిపింది. అఫ్గన్ ప్రజలకు అమెరికా మానవతా సాయం కొనసాగిస్తుందని... అఫ్గన్ ప్రభుత్వం ద్వారా కాకుండా ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు, NGOల ద్వారా తాము అఫ్గన్ పౌరులకు సాయపడతామని స్పష్టం చేసింది. 

తరలింపు ప్రక్రియలో భాగంగా... హెలికాప్టర్లు, విమానాలు, సాయుధ వాహనాలు, హైటెక్ రాకెట్ డిఫెన్స్ సిస్టమ్ లు సహా ఎన్నింటినో అక్కడే వదిలేసింది అమెరికా. కాబూల్ ఎయిర్ పోర్ట్ లో అనేక హెలికాప్టర్లు పడి ఉన్నాయి. అయితే వాటిని తాలిబాన్లు దుర్వినియోగం చేస్తారేమో అనుమానాలు అందరికీ ఉన్నాయి. కానీ అవేవీ పనిచేయకుండా చేసింది అమెరికా. అన్నింటిని ఆల్ మోస్ట్ ధ్వంసం చేసింది. తాము వదిలేసిన విమానాలు, హెలికాప్టర్లు ఎన్నటికీ గాల్లో ఎగరలేవని అమెరికా అధికారి ఒకరు ఇంటర్నేషనల్ మీడియాకు తెలిపారు. 

అఫ్గనిస్తాన్ లో పరిణామాలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఒక తీర్మానాన్ని కూడా UNSC ఆమోదించింది. అఫ్గన్ నేలను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని UNSC చైర్ పర్సన్ స్థానంలో ఉన్న భారత్ సూచించింది. ఉగ్రవాదులకు అఫ్గన్ షెల్టర్ గా మారకూడదన్నారు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా. అఫ్గన్ లోని మైనారిటీలకు భారత్ ఎల్లప్పుడూ సాయం అందిస్తూనే ఉందన్నారు. సిక్కులు, హిందువులకు ఇకపైనా సాయపడతామని తెలిపింది. అఫ్గన్ నుంచి వెళ్లిపోవాలనుకునేవారికి హెల్ప్ చేస్తామన్నారు.