చివరి టీ20 టై...సిరీస్ భారత్ వశం

చివరి టీ20 టై...సిరీస్ భారత్ వశం

భారత్ న్యూజిలాండ్ మధ్య జరగిన చివరి టీ20 టైగా ముగిసింది. 161 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్...9 ఓవర్లలో 4 వికెట్లకు 75 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో..కొద్దిసేపు మ్యాచ్ను అంపైర్లు ఆపేశారు. ఆ తర్వాత ఎంతకు వాన ఆగకపోవడంతో...భారత్ టార్గెట్ను డక్ వర్త్ లూయిస్ ప్రకారం 9 ఓవర్లలో 76 పరుగులకు కుదించారు. ఈ సమయంలో భారత్ 75 పరుగులే చేయడంతో..మ్యాచ్ టైగా ప్రకటించారు. ఇప్పటికే మొదటి మ్యాచ్ వాన వల్ల రద్దయింది. రెండో మ్యాచ్ భారత్ 65 పరుగుల తేడాతో గెలిచింది. చివరి మ్యాచ్ టై కావడంతో..మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను టీమిండియా 1–0తో కైవసం చేసుకుంది. 


 
మళ్లీ విఫలం..
161 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యారు. కిషన్ 10 పరుగులు, పంత్ 11 పరుగులే చేశారు.  శ్రేయస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో సూర్యకుమార్ కు పాండ్య జతకలిశాడు. కొద్దిసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే 13 పరుగులు చేసిన సూర్య..60 పరుగుల వద్ద పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా పాండ్యాకు సహకరించే ప్రయత్నం చేశాడు. అయితే 75 పరుగుల వద్ద మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో థీమ్ సౌతీ రెండు వికెట్లు దక్కించుకోగా..మిల్నే, సోది చెరో వికెట్ తీశారు. 

హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు..
అంతకుముందు టాస్ గెలిచి  బ్యాటింగ్ చేసిన కివీస్..19.4  ఓవర్లలో 160  పరుగులకే ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఆ జట్టు  9 పరుగుల వద్ద తొలి వికెట్ను కోల్పోయింది. ఫిన్ అలెన్ 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మార్క్ చాప్ మాన్ 12 రన్స్ చేసి పెవీలియన్ చేరాడు. దీంతో న్యూజిలాండ్ 44 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కాన్వె, గ్లెన్ ఫిలిప్స్ జట్టును ఆదుకున్నారు. హఫ్ సెంచరీతో జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. మూడో వికెట్ కు 86 పరుగులు జోడించారు. 

టపటపా..
130 పరుగుల వద్ద ఫిలిప్స్ ఔటవడంతో...న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పేకమేడలో కూలిపోయింది. ఆ జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. మరో 16 పరుగుల వ్యవధిలో కాన్వె పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత నీషమ్, సాంట్నర్, మిచెల్ సోదీ, మిల్నే, సౌథీ స్వల్ప పరుగుల వద్ద ఔటవడంతో...చివరకు న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో సిరాజ్ , అర్షదీప్ సింగ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు.