పోటాపోటీ నిరసనలు.. రేవంత్​ వ్యాఖ్యలపై బీఆర్ఎస్​ ఆందోళనలు

పోటాపోటీ నిరసనలు.. రేవంత్​ వ్యాఖ్యలపై బీఆర్ఎస్​ ఆందోళనలు

పోటాపోటీ నిరసనలు
రేవంత్​ వ్యాఖ్యలపై బీఆర్ఎస్​.. 
వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్​ ఆందోళనలు
దిష్టిబొమ్మల దహనాలు, విమర్శలు 
హైదరాబాద్​లో భారీగా ట్రాఫిక్​ జామ్​.. నరకం చూసిన నగరవాసులు

హైదరాబాద్​, వెలుగు : బీఆర్​ఎస్​, కాంగ్రెస్ నేతలు పోటాపోటీ నిరసనలతో హోరెత్తించారు. వ్యవసాయానికి మూడుగంటలే ఫ్రీ కరెంట్​చాలు అంటూ రేవంత్ కామెంట్లు చేశారని, ఫ్రీ కరెంట్​ను ఎత్తివేసేందుకు కాంగ్రెస్​ కుట్ర పన్నుతున్నదని ఆరోపిస్తూ బుధవారం అధికార పార్టీ నేతలు రోడ్ల మీదికి వచ్చారు. హైదరాబాద్​లోని విద్యుత్​ సౌధ వద్ద ఎమ్మెల్సీ కవిత కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. రేవంత్​ వ్యాఖ్యలను బీఆర్​ఎస్​ నేతలు వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్​ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. 

విద్యుత్​ సబ్​స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగారు. ఇటు బీఆర్​ఎస్​ నేతలు.. రేవంత్​ దిష్టిబొమ్మలను దహనం చేయగా, అటు కాంగ్రెస్​ నేతలు.. కేసీఆర్​ దిష్టిబొమ్మలను దహనం చేశారు. రెండు పార్టీల నేతల ధర్నాలు, రాస్తారోకోలతో పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయింది. ముఖ్యంగా ఉదయం హైదరాబాద్​లోని విద్యుత్​ సౌధ వద్ద కవిత ఆందోళనతో భారీ ఎత్తున ట్రాఫిక్​ జామ్​ అయ్యి వాహనదారులు తిప్పలు పడ్డారు. గంటల తరబడి ట్రాఫిక్​లో చిక్కుకుపోయి నరకం అనుభవించారు.