కాగజ్ నగర్ కు చేరుకున్న దిందా గ్రామస్తుల పాదయాత్ర 

కాగజ్ నగర్ కు చేరుకున్న దిందా గ్రామస్తుల పాదయాత్ర 

కుమ్రం భీం జిల్లా : కుమ్రం భీం జిల్లాలోని దిందా గ్రామస్తుల పాదయాత్ర కాగజ్ నగర్ కు చేరుకుంది. కాగజ్ నగర్ లోని తెలంగాణ తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామం నుండి ఆసిఫాబాద్ కలెక్టరేట్ వరకు అంటే 100 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేపట్టారు. దిందా గ్రామస్తుల పాదయాత్రకు బీజేపీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ మద్దతు తెలిపారు. 

గ్రామంలో వాగుపై బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతూ.. దిందా గ్రామస్తులు గత ఆరు రోజులు నిరసన దీక్ష చేపట్టారు. రాత్రి, -పగలు దీక్ష చేసినా స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకోకపోవడంతో చివరకు కలెక్టరేట్ వరకూ పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దిందా వాగుపై వంతెన, రోడ్డు నిర్మించాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏటా వర్షాకాలంలో దిందా వాగు పొంగి.. తమ గ్రామం జలదిగ్బంధం అవుతోందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. 

గత ఏడాది వర్షాకాలంలో నాలుగు రోజులపాటు దీక్ష చేయడంతో అధికారులు స్పందించారు. దిందా వాగుపై బ్రిడ్జి, రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీని నెరవేర్చలేదు. దీంతో మళ్లీ ఆరు రోజులపాటు వాగు వద్ద రాత్రి, పగలు దీక్ష చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆసిఫాబాద్ కలెక్టరేట్ కు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు.