తెలంగాణలో వానలే వానలు..

తెలంగాణలో  వానలే వానలు..

ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్ ,రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి , యాదాద్రి, సిద్దిపేట, జనగాం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల ,పెద్దపల్లి ,భూపాలపల్లి, మంచిర్యాల, కొమరం భీమ్  జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్ని  ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. 

దంచికొట్టిన వాన..
ఆదివారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వాన దంచికొట్టింది. మంచిర్యాల బెల్లంపల్లిలో  అత్యధికంగా 13.2 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పాత రాజంపేటలో 12.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  ఆదిలాబాద్ జిల్లా  పోచారం ఏరియాలో 10.4 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదవగా... మంచిర్యాల, కామారెడ్డి, కొమరం భీమ్, ఆదిలాబాద్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 7.7 సెంటీమీటర్ల నుంచి 10.4 సెంటీమీటర్ల వాన పడింది. 

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో..
నగరంలోని రామచంద్రపురం, పటాన్ చెరు ఏరియాలో 2.8 సెంటీమీటర్లు మోస్తరు వర్షం నమోదైంది. రాజేంద్రనగర్, చందానగర్, మెహదీపట్నం, శేర్లింగంపల్లి, మూసాపేట్, గోషామహల్,  కుకట్ పల్లి, గాజులరామారం, మలక్ పేట్ ఏరియాలో తేలికపాటి జల్లులు పడ్డాయి. 

పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు..
భారీ వర్షాల కారణంగా నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ లోకి వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 9838 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. పూర్థి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టిఎంసీలు కాగా...ప్రస్తుతం 1068.5అడుగుల మేర నీరుంది. 26.138 టిఎంసీల నీరు నిల్వ ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. కొమరం భీమ్ జిల్లాలోని వట్టి వాగు ప్రాజెక్ట్ లోకి కూడా వరద భారీగా వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 239.500 మీటర్లు కాగా.. .. ప్రస్తుతం 238.300 మీటర్ల వరకు నీరుంది. ప్రాజెక్టు  ఇన్ ఫ్లో 1780 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1260 క్యూసెక్కులు. దీంతో అధికారులు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 
ఆడ ప్రాజెక్ట్ వరద నీటితో నిండింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243.000 మీటర్లు కాగా.. ప్రస్తుతం 240.500 మీటర్ల వరకు నీరుంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వస్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.., ప్రస్తుతం 681.500 అడుగుల మేరు నీరుంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1452 క్యూసెక్కులు.  సాత్నాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు ఉండగా..ప్రస్తుతం 279.60 మీటర్ల వరకు నీరు చేరింది.  మత్తడివాగు ప్రాజెక్టు జలకళను సంతరించకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం  277.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 274.85 మీటర్ల వరకు నీరు చేరుకుంది. 

నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం నుంచి కురుస్తున్న వర్షానికి సింగరేణి కేటీకే 2,3 గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.  అటు మంచిర్యాల జిల్లాలో పడిన వాన కారణంగా శ్రీరాంపూర్, మందమర్రి సింగరేణి ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనుల్లో  బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. శ్రీరాంపూర్,కళ్యాణి ఖని,ఆర్కే ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దాదాపు 40 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.