నాలుగు రోజులు  వానలు..ఎల్లో అలర్ట్​జారీ చేసిన వాతావరణ శాఖ

నాలుగు రోజులు  వానలు..ఎల్లో అలర్ట్​జారీ చేసిన వాతావరణ శాఖ

నాలుగు రోజులు  వానలు
ఎల్లో అలర్ట్​జారీ చేసిన వాతావరణ శాఖ
ఆదివారం పలు చోట్ల వాన.. అదే స్థాయిలో ఎండ 
నల్గొండ జిల్లాలో అత్యధికంగా 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత 
వచ్చే రెండు రోజులు టెంపరేచర్లు తగ్గే చాన్స్​  
ఎల్లో అలర్ట్​ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో  నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మొదటి రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా.. ఆ తర్వాత రెండు రోజులు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు పడతాయని ఆదివారం బులెటిన్​లో వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. హైదరాబాద్ సిటీలోనూ వాతావరణం ఇలాగే ఉండే చాన్స్ ఉందని తెలిపింది. ఈ నాలుగు రోజుల పాటు మబ్బులు పట్టే అవకాశం ఉందని, తేలికపాటి జల్లులు కురవొచ్చని పేర్కొంది.

ఆదివారం పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 1.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా సర్ధానలో 1.5, కామారెడ్డి జిల్లా గాంధారిలో 1.4, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 1.1 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్​లోని షేక్​పేట, ఖైరతాబాద్, అమీర్​పేట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. వికారాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్​నగర్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లోనూ జల్లులు కురిశాయి.

ఎండ మండింది..

రాష్ట్రంలో టెంపరేచర్లూ భారీగానే నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా నిడమనూరులో 46.1 డిగ్రీలు, దామరచర్లలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం, కరీంనగర్ జిల్లా తంగులలో 45.5 డిగ్రీలు, నల్గొండ జిల్లా కేతేపల్లిలో 45.3, మహబూబాబాద్ జిల్లా గార్ల, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్, ములుగు జిల్లా తాడ్వాయి హట్స్​లలో 45.2, ఖమ్మం జిల్లా ఖానాపూర్, కూసుమంచిలలో 45.1, సూర్యాపేట జిల్లా పెదవీడు, హుజూర్​నగర్, జయశంకర్ జిల్లా రేగులగూడెం, ఖమ్మం జిల్లా పమ్మిలలో 45 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.

మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైనే నమోదయ్యాయి. హైదరాబాద్​లో అత్యధికంగా గచ్చిబౌలిలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. రాబోయే రెండు రోజులు ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.