కొమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం

కొమురంభీం జిల్లాలో పెద్దపులి సంచారం

బాబోయ్ పులి. ఈపేరు వింటేనే భయంతో వణికిపోతున్నారు అక్కడి ప్రజలు. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం విలేజ్ నెంబర్ 13 ఊర్లోకి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. పులాస్ సర్దార్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి పులి వచ్చింది. ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. ఎప్పుటు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్థుల భయాందోళన చెందుతున్నారు. పులి జాడను కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

ఇటీవల ములుగు జిల్లాలోని తాడ్వాయి, మంగపేట మండలాల్లో మూడు రోజులుగా పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.  తాడ్వాయి మండలంలోని కామారం అటవీ ప్రాంతంలో పశువుల మంద పైకి దాడికి యత్నించింది.  మంగపేట మండలంలో లేగపై దాడి చేసి చంపింది. మేత కోసం తాడ్వాయి మండలం కామారం అడవికి తోలుకెళ్లిన బర్రెల మందపై  పెద్ద పులి దాడికి యత్నించింది. అది చూసిన పశువుల కాపరి పులి రమేశ్ భయంతో కేకలు వేశాడు. దాంతో పులికి అక్కడి నుంచి పారిపోయింది.

అతని ద్వారా సమాచారం అందుకున్న తాడ్వాయి ఫారెస్ట్ ఆఫీసర్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా పెద్దపులి కాలి ముద్రలను గుర్తించారు. రైతులు, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కాగా మంగపేట మండలంలోని కొత్తూరు మొట్లగూడెం అనుబంధ గ్రామమైన శ్రీరాంనగర్ గొత్తికోయ గూడెంకు సమీపంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో మోట్లగూడెంకు చెందిన బంగారి నాగేశ్​లేగ దూడ మృతి చెందింది. కాపర్ల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్​ ఆఫీసర్లు పెద్దపులి దాడిగా కన్ఫార్మ్​చేశారు.  పులి దాడి చేసిన ప్రాంతాల్లో సీసీ కెమెరా ట్రాకర్స్ ఏర్పాటు చేశారు. వరుస ఘటనలతో ఆయా మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండు చోట్ల దాడి చేసింది ఒకటే పులా, లేక రెండు ఉన్నాయా అని భయపడుతున్నారు.