డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలె

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలె

హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో 60000 ఇండ్లు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ కు అధికారులు తెలిపారు. సోమవారం (జులై 4న) హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్, నానక్ రాంగూడా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియ ప్రారంభంపై సమీక్ష  నిర్వహించారు.

ఇప్పటివరకూ పూర్తైన 60వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను వారం రోజుల్లో సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్ర హౌసింగ్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలన్నారు. మార్గదర్శకాలను రూపొందించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ర్ట  ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కచ్చితంగా ఇల్లు లేని నిరుపేదలకు మాత్రమే అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అవసరమైన క్షేత్రస్థాయి గుర్తింపు, వెరిఫికేషన్ వంటి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున బృందాలను ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చేవారం మరోసారి ఈ అంశంపై సమావేశం ఉంటుందని తెలిపిన కేటీఆర్, ఆలోగా తుది మార్గదర్శకాలతో, ఇండ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన ఖచ్చితమైన కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ, హౌసింగ్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.