
- బ్రేక్ డ్యాన్సులకు అలవాటు పడ్డొళ్లే అట్ల మాట్లడుతరు : కొండా సురేఖ
హైదరాబాద్, వెలుగు : మహిళలను దుర్భాషలాడిన కేటీఆర్ కేవలం ట్వీట్ చేసినంత మాత్రాన సరిపోదని, మహిళా సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఆర్టీసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ఉద్దేశించి నిన్న పార్టీ మీటింగ్ లో తెలంగాణ మహిళలను బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకొమ్మని అనటంపై మహిళలు బాధపడుతున్నారని శుక్రవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే మీడియా ముఖంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలన్నారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలతో విసిగి వేసారిన ప్రజలు అధికారాన్ని దూరం చేసినా వారికి అహంకారం తగ్గ లేదని మంత్రి అన్నారు. మహాలక్ష్మి స్కీమ్ పై బీఆర్ఎస్ నాయకులు చిన్నచూపు చూస్తున్నారని, మహిళలు తమ పనుల నిమిత్తం జర్నీలు చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.
‘‘క్లబ్బుల్లో, పబ్బుల్లో డ్యాన్సులు చేసిన చరిత్ర నీకుండవచ్చు గానీ, మహిళా సమాజాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడితే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని మంత్రి సురేఖ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి జడ్పీటీసీ నుంచి సీఎం స్ధాయికి ఎదిగారని, అయ్య పేరు చెప్పుకొని విదేశాల నుంచి వచ్చి ఉద్యమ కారుల పొట్ట కొట్టి పదవులు పొందలేదని గుర్తు చేశారు.