దొర వదిలినా.. ధరణి వదలట్లే

దొర వదిలినా.. ధరణి వదలట్లే
  • ఎర్రబాడు దొర కుటుంబం పేరిట 9 ఊర్లలో 1,842 ఎకరాలు 
  • 50 ఏండ్లుగా కాస్తులో ఉన్న రైతులకు అందని పాస్ బుక్స్ 
  • భూరికార్డుల ప్రక్షాళనతో మళ్లీ తెరపైకి దొరల పేర్లు
  • ఆ భూములు అమ్మేశామని వాళ్లు చెప్పినా పట్టించుకోని సర్కార్ 
  • నాలుగేండ్లుగా రైతుబంధు కోల్పోతున్న వేలాది మంది రైతులు 

వరంగల్ ప్రతినిధి, వెలుగు : భూరికార్డుల ప్రక్షాళనలో దొర్లిన తప్పులు రైతులకు శాపంగా మారాయి. చాలా ఊర్లలో కాస్తుదారులను పక్కన పెట్టిన ప్రభుత్వం.. భూములు అమ్ముకున్న పట్టాదారుల పేర్లనే ధరణిలో చేర్చింది. నిజాం హయాం నాటి కొందరు దొరలు, దేశ్​ముఖ్​లు, జమీందార్లు 50, 60 ఏండ్ల క్రితమే అమ్ముకున్న, దానంగా ఇచ్చిన వందలాది ఎకరాల భూములు ఇంకా వాళ్ల పేర్లపైనే ఉండడం ధరణి పోర్టల్ లోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఒక కుటుంబానికి 54 ఎకరాలకు మించి భూమి ఉండొద్దని ల్యాండ్ సీలింగ్ యాక్ట్  చెప్తున్నప్పటికీ.. ఓ దేశ్ ముఖ్ వారసుల పేరిట అధికారులు ధరణిలో ఏకంగా 1,842 ఎకరాలు ఎక్కించారు. దీంతో ఆ భూములు సాగు చేసుకుంటున్న సూర్యాపేట జిల్లా నూతనకల్లు, మద్దిరాల మండలాల్లోని 9 ఊర్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పాస్ బుక్స్ రాక నాలుగేండ్లుగా రైతు బంధు, రైతు బీమా, క్రాప్ లోన్లకు నోచుకోవడం లేదు. వీళ్లందరూ దాదాపు రూ.10 కోట్లు నష్టపోయారని అంచనా.

మొత్తం ముగ్గురి పేరిట..

నిజాం రాజ్యంలో ఎర్రబాడు దొరగా ప్రసిద్ధి చెందిన జెన్నారెడ్డి ప్రతాపరెడ్డికి ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో లక్షన్నర ఎకరాల భూమి ఉండేది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఇందులోని వేలాది ఎకరాలను పేదలకు పంచారు. అనంతరం కౌలు రక్షిత చట్టం, భూసంస్కరణల చట్టం అమల్లోకి వచ్చే క్రమంలో ఆ భూములను ఆ కుటుంబం అమ్ముకోవడమో, తమ దగ్గర పని చేసేవాళ్లకు దానంగా ఇవ్వడమో చేసింది. 1972లో భూసంస్కరణల చట్టం అమల్లోకి వచ్చే నాటికే ఆ కుటుంబానికి చట్ట ప్రకారం ఉండాల్సిన భూములు తప్ప.. మిగతావన్ని రైతుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అయితే పట్టాదారు కాలమ్ లో ప్రతాపరెడ్డి భార్య సుభద్రమ్మ, ఆయన కొడుకులు శ్యాంసుందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి పేర్లు వచ్చాయి. కాస్తుదారు కాలమ్ లో మాత్రం సాగు చేసుకుంటున్న రైతుల పేర్లే వచ్చాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో కాస్తుదారుల పేర్లు ఎగిరిపోయి.. పట్టాదారులుగా శ్యాంసుందర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, సుభద్రమ్మ పేర్లు మాత్రమే వచ్చాయి. ఒక్క శ్యాంసుందర్ రెడ్డి పేరు మీదే 1,533 ఎకరాల భూమి నమోదు కాగా, సుధీర్ రెడ్డి పేరు మీద 174 ఎకరాలు, సుభద్రమ్మ పేరిట 135 ఎకరాలు రికార్డుల్లోకి ఎక్కింది. 

ఎక్కడ ఎంత భూమి ఉందంటే... 
నూతనకల్లు మండల కేంద్రంలో 90 సర్వే నంబర్లలో 330.26 ఎకరాలు, చిల్పకుంట్లలోని 132 సర్వే నంబర్లలో 263.24, ఎర్రపహాడ్ (ఎర్రబాడు)లోని 1‌‌‌‌01 సర్వే నంబర్లలో 199.33, యడవల్లిలోని 98 సర్వే నంబర్లలో  194.34,  గుండ్లసింగారంలోని 65 సర్వే నంబర్లలో 66, దిర్శనపల్లిలోని 49 సర్వే నంబర్లలో 127.07 ఎకరాలు, మద్దిరాల మండలం చందుపట్లలోని 74 సర్వే నంబర్లలో 272.37 ఎకరాలు, మామిండ్ల మడువలోని 10 సర్వే నంబర్లలో 21.15, ముకుందాపురంలో 57.13 ఎకరాల భూమి శ్యాసుందర్ రెడ్డి పేరిట నమోదైంది. నూతనకల్లు మండల కేంద్రంలోని 24 సర్వే నంబర్లలో 128.03 ఎకరాలు, ఎర్రబాడులో 46.17 ఎకరాలు సుధీర్ రెడ్డి పేరిట ఉంది. ఇదే మండంలోని యడవల్లిలో సుభద్రమ్మ పేరిట 92 సర్వే నంబర్లలో 135 ఎకరాల భూమి ఉన్నట్లు ధరణి రికార్డులు వెల్లడిస్తున్నాయి.  

భూములపై సర్కార్ కన్ను... 
సీలింగ్ యాక్ట్ కు విరుద్ధంగా ఒకే కుటుంబానికి వందలాది ఎకరాలు ఉండడంతో.. ఆ భూములను సర్కార్ కు అప్పగించాలని అప్పట్లో రెవెన్యూ అధికారులు ప్రతాపరెడ్డి కుటుంబానికి నోటీసులు ఇచ్చారు. అయితే ఆ భూములు అసలు తమ చేతుల్లో లేవని, ఎప్పుడో అమ్మేశామని, రైతులకు ఇచ్చేశామని, వాళ్లే సాగు చేసుకుంటున్నారని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా ఇవన్నీ పట్టా భూములు అయినప్పటికీ నిషేధిత జాబితాలో పెట్టింది. మరోవైపు తమకు పాస్ బుక్స్ ఇవ్వాలని నాలుగేండ్లుగా రైతులు తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు కలిసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా తమకు పాస్ బుక్స్ ఇవ్వాలని, భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధిత రైతులు కోరుతున్నారు.