ఇండియాలో ఐ ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ 

ఇండియాలో ఐ ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ 

స్మార్ట్ ఫోన్ మార్కెట్ కి సెప్టెంబర్ నెల మరింత స్పెషల్ కానుంది. ఎందుకంటే ఈ వారం భారతీయ మార్కెట్ లో కొత్త కొత్త ఫోన్‌లు లాంచ్ కానున్నాయి. క్రిస్మస్ పండుగకు సరిగ్గా నాలుగు నెలల ముందు వచ్చే ఈ నెలలో స్మార్ట్ ఫోన్లను రిలీజ్ చేస్తే సేల్స్ బాగా జరుగుతాయని విదేశీ టెక్ కంపెనీలు అంచనా. అందుకే లాంచ్ ఈవెంట్స్‌ను ఈనెలలోనే ప్లాన్ చేస్తుంటాయి. ఈ నెలలో ప్రీమియం మొబైల్స్ చాలా వరకూ లాంచ్ అవుతున్నాయి.

ఐ ఫోన్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఐఫోన్‌ కొత్త మోడల్‌ కోసం ఎదురుచూస్తున్న యాపిల్‌ లవర్స్‌ కల శుక్రవారం నెరవేరబోతోంది. యాపిల్ కంపెనీ ఐఫోన్ కొత్త మోడళ్లను(iPhone 14 models) విడుదల చేయనుంది. ఐఫోన్ 14, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లను యాపిల్ కంపెనీ శుక్రవారం ఇండియాలో విడుదల చేయనుంది. గతేడాది మాదిరిగానే చిన్నపాటి మార్పుతో నాలుగు మోడళ్లను కంపెనీ ఆవిష్కరించింది. భారతదేశంలో ఐ ఫోన్ 14 మోడల్ ధర రూ.79,900గా కంపెనీ నిర్ణయించింది. 

ఆపిల్ కంపెనీ ఐఫోన్‌-14 సిరీస్ ఫోన్లు నాలుగు వేరియంట్లలో తీసుకొస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ మోడల్ రూ.89,900లుగా, ఐఫోన్ 14 ప్రో ధర రూ.1,09,900, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,39,900గా యాపిల్ నిర్ణయించింది. ఆపిల్ ఇండియా వెబ్‌సైట్ ట్రేడింగ్ ఈఎంఐ చెల్లింపులపై కూడా ఫోన్లను అందిస్తోంది. ప్రీ-ఆర్డర్‌లు సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. ఐఫోన్ 14 విక్రయాలు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని యాపిల్ కంపెనీ వెల్లడించింది. ఐఫోన్ 14, ఐఫోన్ ప్లస్ మోడల్స్ మాత్రం ఓల్డ్ ప్రాసెసర్ A15తో వస్తున్నాయి. ఈ మోడల్స్‌లో సోనీ అప్‌డేటెడ్ 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రైమరీ కెమెరాగా అందించారని టెక్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. వీటితోపాటు మూడు కొత్త ఐప్యాడ్స్‌, మ్యాక్ కంప్యూట‌ర్లు, ఆపిల్ వాచ్ ప్రో, ఆపిల్ వాచ్ సిరీస్‌ -8 విడుద‌లకానున్నాయని టెక్ వర్గాల ద్వారా తెలుస్తోంది. 

ఈ సారి వ‌చ్చే ఐఫోన్లలో మొబైల్ ఫోన్ నెట్‌వ‌ర్క్ లేని ప్రాంతాల్లోనూ శాటిలైట్ క‌నెక్టివిటీతో ఫోన్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు పంపించొచ్చని తెలుస్తోంది. ఇందుకోసం ఆపిల్ సొంతంగా శాటిలైట్ క‌మ్యూనికేష‌న్ ఫీచ‌ర్ లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈవో) ఆఫ‌ర్ చేస్తోంది. ఇలా శాటిలైట్ క‌నెక్టివిటీతో ఫోన్ కాల్స్ చేసుకోవ‌డానికి వీలుగా గ్లోబ‌ల్ స్టార్ అనే సంస్థతో క‌లిసి ఆపిల్ సొంత శాటిలైట్ క‌మ్యూనికేష‌న్ వ్యవ‌స్థను ప్రారంభించ‌బోతున్నట్లు సమాచారం. టెస్లా సీఈవో ఎల‌న్‌మ‌స్క్ ఆధ్వర్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ.. ఇప్పటికే శాటిలైట్ ఆధారిత ఇంట‌ర్నెట్ సేవ‌లు అందిస్తోంది. ఆపిల్ సొంతంగా శాటిలైట్ క‌మ్యూనికేష‌న్స్ వ్యవ‌స్థను ప్రారంభిస్తే.. స్పేస్ ఎక్స్ మాదిరిగా శాటిలైట్ ఆధారిత ఇంట‌ర్నెట్ సేవ‌లు అందించే సంస్థల జాబితాలో యాపిల్ చేరనుంది.