
ఖానాపూర్, వెలుగు: యువతిని వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని హత్య చేయడంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రాచల అనిల్ కుమార్ అలియాస్ తిరుమలేశ్(23) తండ్రి వెంకటరాజు ఉపాధి కోసం గల్ఫ్వలస వెళ్లాడు. తిరుమలేశ్ ఇటీవలే డిగ్రీ పూర్తి చేశాడు. బుధవారం అర్ధరాత్రి తిరుమలేశ్యువతి ఇంటి మీదుగా వెళుతున్నాడు. ఇది చూసి యువతి తండ్రి నాగరాజు తన కూతురిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ మరో ఇద్దరితో కలిసి తిరుమలేశ్‌పై కర్రలతో దాడి చేశాడు. తిరుమలేశ్‌కు తీవ్ర గాయాలవడంతో గ్రామస్తులు అతడిని నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చనిపోయాడు. గురువారం ఉదయం నిర్మల్ ఏరియా హాస్పిటల్ లో పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అన్యాయంగా తిరుమలేశ్ను చంపేశారంటూ డెడ్‌బాడీతో బంధువులు, అతడి ఫ్రెండ్స్ గ్రామంలో ఆందోళన చేపట్టారు. మృతదేహాన్ని నిందితుల ఇంటి వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎంతకూ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి సర్దిచెప్పారు. పోలీసుల పహారా మధ్య అంత్యక్రియలు పూర్తి చేయించారు. హత్యకు కారకులైన నిందితులపై హత్య, కిడ్నాప్ కేసులతో పాటు రౌడీషీట్తెరవనున్నట్లు డీఎస్పీ చెప్పారు.