
చంచల్‌గూడ జైల్లోనే విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతి
సోమ, మంగళవారాల్లో ప్రశ్నించనున్న ఈడీ అధికారులు
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందుకుమార్‌ను విచారించేందుకు ఈడీకి నాంపల్లి కోర్టు పర్మిషన్ ఇచ్చింది. మొయినాబాద్, బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసుల్లో నందుకుమార్‌ను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లిలోని 3వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శనివారం విచారణ జరిపిన కోర్టు.. అడ్వకేట్ సమక్షంలో రెండు రోజుల పాటు ప్రశ్నించేందుకు అనుమతి ఇచ్చింది. సోమ, మంగళవారాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్స్ సుమిత్ గోయల్, దేవేందర్ కుమార్ సింగ్, అసిస్టింట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్ అజిత్ గరేడ్, వీర నారాయణ రెడ్డిలను స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. కొవిడ్–19 ప్రొటోకాల్ ప్రకారం ముందస్తు కరోనా నెగటివ్ రిపోర్ట్ అందించాలని స్పష్టం చేసింది. జైల్ గైడ్‌లైన్స్‌కు లోబడి నిందితుడు నందుకుమార్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేలా చర్యలు తీసుకోవాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రెండు రోజులు నందుకుమార్‌ను చంచల్‌గూడ జైల్లోనే ఈడీ అధికారులు విచారించనున్నారు.
అక్రమ లావాదేవీలపై నజర్
సెవెన్ హిల్స్ మాణిక్‌చంద్ డైరెక్టర్ ఆవాల అభిషేక్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో నందుకుమార్ జరిపిన వ్యాపార లావాదేవీలు, మనీలాండరింగ్‌కు సంబంధించిన వివరాలతో ఈడీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనుంది. ప్రధానంగా డబ్ల్యూ3 హాస్పిటాలిటీ సర్వీసెస్‌పైనే ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఈ సంస్థలో నందుకుమార్, కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు డైరెక్టర్లుగా ఆవాల అభిషేక్ అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ ముగ్గురితో పాటు పైలెట్ రోహిత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తున్నది. రూల్స్‌కు వ్యతిరేకంగా వివిధ సంస్థలు, షెల్ కంపెనీల ద్వారా జరిగిన మనీలాండరింగ్‌పై వివరాలు సేకరించింది. ఈ క్రమంలోనే చంచల్‌గూడ జైలులో ఉన్న నందుకుమార్‌ను విచారించనుంది. నందుకుమార్ స్టేట్‌మెంట్ ఆధారంగా మరికొంత మందికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించనున్నట్లు సమాచారం.