జైనూర్ ఘటనపై 2 వారాల్లోనివేదిక ఇవ్వండి

జైనూర్ ఘటనపై 2 వారాల్లోనివేదిక ఇవ్వండి
  • రాష్ట్ర సీఎస్, డీజీపీకిఎన్​హెచ్చార్సీ నోటీసులు

న్యూఢిల్లీ, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం, దాడి ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్​హెచ్చార్సీ) స్పందించింది. రెండు వారాల్లో పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర సీఎస్, డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. అత్యాచార ఘటన, ఆపై నెలకొన్న ఘర్షణలపై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించినట్లు ఎన్​హెచ్చార్సీ వెల్లడించింది. ఘటన అనంతరం జరిగిన ఆందోళనల్లో దుకాణాలు, షాపులు దహనం అయ్యాయని, శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసు బలగాల మోహరింపుతోపాటు

ఇంటర్నేట్ సేవలను నిలిపివేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని పేర్కొంది. అవన్నీ నిజమే అయితే మానవ హక్కులకు భంగం కలిగినట్లేనని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై 2 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. బాధితురాలి ఆరోగ్యం, ఆమెకు అధికారులు అందించిన కౌన్సెలింగ్, నష్టపరిహారం, ఎఫ్ఐఆర్ కాపీ సమర్పించాలని పేర్కొంది. గత నెల 31 న జరిగిన ఈ ఘటనపై సెప్టెంబర్ 4 వ తేదీన లింగరూర్, సిర్పూర్ యూ మండలాల ఆదివాసీలు పెద్ద సంఖ్యలో వచ్చి జైనూరులో ఆందోళనకు దిగారు. అనంతరం చెలరేగిన ఘర్షణలో ఇరు వర్గాల ఇండ్లు, దుకాణాలు ధ్వంసం అయ్యాయి.