మూడేళ్లలో 3 లక్షల ఆసరా పింఛన్లు కట్

మూడేళ్లలో 3 లక్షల ఆసరా పింఛన్లు కట్

హైదరాబాద్, వెలుగు : గత మూడేళ్లలో ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గింది. గత ఎన్నికల ముందుతో పోలిస్తే మూడేళ్లలో 3 లక్షల పింఛన్లు రద్దు కాగా.. సర్కార్​కు రూ.2,639 కోట్ల ఆదా అయినట్టు రాష్ట్ర ప్రణాళిక శాఖ శుక్రవారం విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది. ఈ రిపోర్ట్ ప్రకారం 2018–19లో 40,35,173 మంది ఆసరా పింఛన్లు పొందేవారు. 2019–20లో లబ్ధిదారుల సంఖ్య 39,78,514కి పడిపోయింది. 2020–21లో లబ్దిదారులు 38,80,265 ఉండగా, 2021–22లో 37,34,342కు చేరుకున్నారు. 2020–21లో ఆసరా పింఛన్ల కోసం రూ.9,717 కోట్లు ఇవ్వగా.. 2021–22లో రూ.7,078 కోట్లు విడుదల చేసింది.

మార్కెట్ వాల్యూపెంపుతో ఆదాయం డబుల్

రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్ కం డబుల్ అయినట్లు ప్రణాళిక శాఖ తన రిపోర్టులో పేర్కొంది. వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సు ప్రకారం.. భూమి మార్కెట్ వాల్యూను సవరించడం, రిజిస్ట్రేషన్, స్టాంప్​ డ్యూటీ పెంపుతో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2019–20తో పోలిస్తే 2021–22లో నెలవారీ ఆదాయం డబుల్ అయినట్లు రిపోర్ట్​లో వెల్లడించింది.

జనాభాకు మించి ఫోన్లు.. 

రాష్ట్రంలో జనాభాకు మించి ఫోన్ కనెక్షన్లు ఉన్నాయి. జనాభా 3.72 కోట్లు ఉండగా.. టెలిఫోన్​ సబ్ స్ర్కైబర్స్ 4.22 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 98శాతం మంది వైర్​లెస్​(సెల్​ఫోన్) కనెక్షన్ కలిగినవారే. గ్రామీణ ప్రాంతాల్లో సెల్​ఫోన్ కనెక్షన్లు 1.79 కోట్లు ఉండగా, 40వేల మంది వైర్​లైన్​ చందాదారులున్నారు. అర్బన్ ఏరియాల్లో 2.42 కోట్ల సెల్​ఫోన్​ కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రతి 100 మందికి 110 మొబైల్ కనెక్షన్లు ఉన్నట్లు ప్రణాళిక శాఖ రిపోర్ట్ లో పేర్కొంది.