విజృంభిస్తున్న డెంగీ.. ప్రభుత్వ, ప్రైవేట్​ ఆసుపత్రులకు రోగుల క్యూ

విజృంభిస్తున్న డెంగీ.. ప్రభుత్వ, ప్రైవేట్​ ఆసుపత్రులకు రోగుల క్యూ
  • ప్రభుత్వ, ప్రైవేట్​ ఆసుపత్రులకు రోగుల క్యూ
  • పారిశుధ్యలోపంతో పెరుగుతున్న దోమలు
  • క్లీన్​గా ఉంచుకోవాలంటున్న ఆఫీసర్లు

మెదక్, వెలుగు: జిల్లాలో డెంగీ వ్యాధి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఇటు ఆఫీసర్లు, అటు జనాల్లో దడ పెరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా తొమ్మిది డెంగీ కేసులు నమోదయ్యాయి. నార్సింగి మండలంలో రెండు, కౌడిపల్లి, చిన్నశంకరంపేట, పాపన్నపేట, టేక్మాల్, హవేలి ఘనపూర్​​ మండలాల్లో ఒక్కో కేసు, మెదక్ మున్సిపాలిటీలో ఇద్దరికి డెంగీ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. కాగా డెంగీ సోకిన మరో నలుగురు ప్రైవేట్​హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. గతేడాది జిల్లాలో 43 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది మరో ఐదు నెలలు ఉండగానే వర్షాకాలం ప్రారంభంలోనే తొమ్మిది కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం ఆందోళనకు గురవుతోంది. 

పెరుగుతున్న వైరల్​ ఫీవర్స్​...

వానాకాలం ప్రారంభం నుంచి వాతావరణంలో వస్తున్న మార్పులతో జిల్లాలో వైరల్​ఫీవర్స్​ ప్రబలుతున్నాయి. వారం రోజుల క్రితం వరకు వాతావరం ఒకలా ఉండగా, తుఫాన్​ప్రభావంతో ఐదారు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో పరిస్థితులు మారిపోయాయి. దీంతో జ్వరం, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వస్తున్న వారిలో ఎక్కువ మంది వైరల్​ఫీవర్ బాధపడుతున్నట్టు డాక్టర్​లు చెబుతున్నారు.   

పారిశుధ్య కార్మికుల సమ్మెతో...

గ్రామాల్లో జీపీ కార్మికులు, పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గ్రామాలతోపాటు పట్టణాల్లో చెత్త తొలగింపు, మురికి కాల్వలు శుభ్రం చేయడం వంటి పనులు నిలిచిపోయాయి. చెత్త బండ్లు, ట్రాక్టర్​లు రాకపోవడంతో ప్రజలు ఇళ్లలో పోగయ్యే చెత్తను, మిగిలిన ఆహార  పదార్థాలను ఇళ్ల సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో పారబోస్తున్నారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి పరిసరాల పరిశుభ్రత లోపిస్తోంది. దీంతోపాటు గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో ఇళ్ల మధ్య నీరు నిలిచి మురికి కుంటలుగా మారాయి. ఇవి దోమల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇలా పారిశుధ్యలోపంతో వ్యాధులు ప్రబలుతున్నాయి.  

జాగ్రత్తలు తీసుకోవాలి...

నిల్వ ఉన్న నీటిలో పెరిగే ఈడిస్ ఈజిప్ట్(టైగర్​దోమ) దోమ కాటుతో డెంగీ సోకుతుంది. అలాంటి దోమలు పెరిగేందుకు అవకాశం ఇవ్వకుండా ఇంటి పరిసరాలల్లో పరిశుభ్రత పాటించాలి. నీళ్ల ట్యాంకులు, డ్రమ్ములు, ఇతర నీటి పాత్రలపై తప్పకుండా మూతలు పెట్టుకోవాలి. ఇళ్లలో నిల్వ ఉన్న నీళ్లను పారబోయాలి. డెంగీ నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ అందిస్తున్నాం. డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో దోమల నివారణ మందు స్ర్పే చేయిస్తున్నాం. - కుమారస్వామి, జిల్లా మలేరియా ఆఫీసర్