కరోనా ఇన్​పేషెంట్లు తగ్గట్లే..వారం రోజులుగా ఇదే ట్రెండ్

V6 Velugu Posted on Jul 13, 2021


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు దవాఖాన్లలో ఇన్‌‌ పేషెంట్ల సంఖ్య తగ్గట్లేదు. హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అవుతున్న పేషెంట్ల సంఖ్యకు సమానంగా కొత్త పేషెంట్లు చేరుతున్నారు. గాంధీ హాస్పిటల్‌‌లో ఇప్పటికీ రోజూ 40 మంది పేషెంట్లు అడ్మిట్ అవుతున్నారు. అంతే సంఖ్యలో డిశ్చార్జ్ అవుతున్నారు. పేషెంట్ల సంఖ్య 200 తగ్గితే సోమవారం నుంచి నాన్‌‌ కొవిడ్ ఓపీ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఐపీ తగ్గకపోవడంతో 10 రోజులు ఆగాలని నిర్ణయించారు. ప్రస్తుతం గాంధీలో 394 మంది పేషెంట్లు ఉన్నారని నోడల్ ఆఫీసర్ ప్రభాకర్‌‌‌‌రెడ్డి తెలిపారు. కొన్ని చోట్ల డిశ్చార్జ్‌‌ల కన్నా చేరే వాళ్లు పెరుగుతున్నారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌‌లో ఉన్న 50 ఐసీయూ బెడ్లన్నీ ఫుల్ అయ్యాయి. నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌‌లో వారం రోజుల క్రితం ఐసీయూలో నలుగురు ఉంటే ఇప్పుడు 20 మంది ఉన్నారని డాక్టర్లు తెలిపారు. నిమ్స్‌‌లో ఆక్సిజన్, ఐసీయూ, వెంటిలేటర్ సహా కరోనా కోసం కేటాయించిన 173 బెడ్లు నిండినట్టు హెల్త్ డిపార్ట్‌‌మెంట్ వెబ్‌‌సైట్‌‌లోని డ్యాష్‌‌బోర్డులో పేర్కొన్నారు. రాష్ట్రంలో మే మూడో వారంలో కరోనా పేషెంట్ల సంఖ్య తగ్గడం మొదలై ఈ నెల తొలి వారం వరకు ఇదే ట్రెండ్‌‌ కొనసాగిందని.. కానీ వారం రోజులుగా పేషెంట్ల సంఖ్య నిలకడగా ఉంటోందని డాక్టర్లు చెబుతున్నారు. 

ఎక్కువ కేసులు.. తక్కువ లెక్కలు

రాష్ట్రంలోని ఏడెనిమిది జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గలేదని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. హెల్త్ సెక్రటరీ రిజ్వీ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌‌రెడ్డి తదితరులు రెండ్రోజులుగా ఆ జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్, మహబూబాబాద్‌‌, సిరిసిల్ల జిల్లాల్లో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ఖమ్మంలో రోజూ 300 పైనే నమోదవుతున్నాయి. బులెటిన్‌‌లో మాత్రం రోజూ 70–80 కేసులే చూపిస్తున్నారు. కరోనా ఇన్‌‌పేషెంట్ల సంఖ్యపై సర్కారు లెక్కలు మరింత వింతగా ఉంటున్నాయి. ఈ నెల ఒకటి  నుంచి వారం రోజుల పాటు బెడ్ల డ్యాష్ బోర్డును బంద్ పెట్టారు. కేసులు పెరుగుతున్నందుకే బంద్ పెట్టారని విమర్శలు రావడంతో మళ్లీ స్టార్ట్ చేశారు. ఆ లెక్కలపై ఇప్పటికీ అనుమానాలున్నాయి. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 10,148 ఉంటే అందులో 4,118 మంది (40.57 శాతం) మంది హాస్పిటల్‌‌లోనే ఉన్నట్టు చూపించారు. అంటే కరోనా వచ్చిన ప్రతి వంద మందిలో 40 మంది దవాఖాన్లలో చేరినట్టు లెక్క. వాస్తవానికి ప్రతి వందలో 7 లేదా 8 మందే దవాఖాన్లలో చేరుతున్నారు. దీన్ని బట్టి ఇన్‌‌పేషెంట్ల సంఖ్య లేదా యాక్టివ్ కేసుల సంఖ్యలో భారీ తేడాలున్నట్టు తెలుస్తోంది.

సభలు, సమావేశాలతో ముప్పు

లాక్‌‌డౌన్ ఎత్తేసినప్పటి నుంచి రాష్ట్రంలో సభలు, సమావేశాలు బాగా జరుగుతున్నాయి. కేసీఆర్ దగ్గర్నుంచి సర్పంచ్‌‌ల వరకూ జనాలను పోగేసి మీటింగులు పెడుతున్నారు. హరితహారం రికార్డుల కోసం, లీడర్లకు హారతులు పట్టడం కోసం వేల మందిని ఒకచోటుకు తీసుకొస్తున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరిట ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకూ సోషల్ డిస్టెన్స్ నిబంధనలను పట్టించుకోవట్లేదు. లాక్‌‌డౌన్ ఎత్తేసినంక 2 రోజులకే వాసాలమర్రిలో 2 వేల మందితో కేసీఆర్ సభ నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి ఊరిలో యాక్టివిటీ మొదలైంది. ప్రతిపక్ష పార్టీల లీడర్లు రేవంత్‌‌రెడ్డి, బండి సంజయ్ సహా ప్రతి ఒక్కరూ మీటింగులు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇలాంటి సభలు, సమావేశాలతో కొత్త వేరియంట్లు, చాలా తక్కువ టైమ్​లో ఎక్కువ మందికి అంటుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, కేరళ, కర్నాటకలో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీలో నైట్ కర్ఫ్యూ ఉండగా, డే టైమ్‌‌లో 144 సెక్షన్ అమలు చేయాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో లాక్‌‌డౌన్ ఎత్తేసి థర్డ్ వేవ్‌‌ను ఆహ్వానించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని డాక్టర్లు అంటున్నారు. తమకు ఊపిరి తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పాజిటివిటీ 0.6 శాతమే!

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు భారీగా పడిపోయిందని హెల్త్ డిపార్ట్‌‌మెంట్ ప్రకటించింది. సోమవారం 1,05,797 మందికి టెస్టులు చేస్తే 696 (0.6 శాతం) మందికే పాజిటివ్‌‌ వచ్చిందని పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌‌లో 68, జిల్లాల్లో 628 కేసులు వచ్చినట్టు చూపించారు. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 6,32,379 పెరగ్గా ఇందులో 6,18,496 మంది కోలుకున్నట్టు పేర్కొన్నారు. కరోనాతో సోమవారం ఆరుగురు చనిపోయారని వీరితో కలిపి మృతుల సంఖ్య 3,735కి పెరిగిందని ప్రకటించారు.

Tagged Telangana, public, state, Corona patients, private hospitals

Latest Videos

Subscribe Now

More News