రాష్ట్రంలో 608కి చేరిన మండలాల సంఖ్య

రాష్ట్రంలో 608కి చేరిన మండలాల సంఖ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా మరో మండలం ఏర్పాటైంది. నిజామాబాద్ జిల్లా బోధన్ రెవెన్యూ డివిజన్​లో 14 గ్రామాలతో పొతంగల్​ను మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కోటగిరి మండలంలో ఉన్న పొతంగల్, కొడిచెర్ల, జల్లపల్లె, సుంకిని, కల్లూర్, హంగర్గ, హెగ్డోలి, కొల్లూర్, దోమలెడ్గి, సోంపూర్, టక్లి, కారేగావ్, హమ్నాపూర్, తిరుమలాపూర్ గ్రామాలతో పొతంగల్ మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదే జిల్లాలో సెప్టెంబర్​లో సాలూర, ఆలూరు, డొంకేశ్వర్ మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పొతంగల్​తో కలిపితే రాష్ట్రంలోని రెవెన్యూ మండలాల సంఖ్య 608కి చేరింది. 

స్పీకర్ పోచారం హర్షం

బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో పొతంగల్​ను మండలంగా ఏర్పాటు చేయడంపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పొతంగల్ ప్రజలకు తాను ఇచ్చిన హామీ నెరవేరిందని, ఇందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.