ఆపద అని పోతే.. అడ్మిట్ చేసుకోవట్లె

ఆపద అని పోతే.. అడ్మిట్ చేసుకోవట్లె

కరోనా పేరుతో మెడిసిన్​ ఇచ్చి పంపిస్తున్నరు
రోజురోజుకు పెరుగుతోన్న ఓపీ పేషెంట్లు
ఎక్కువైతున్న సీజనల్ ​డిసీజెస్​ కేసులు

హైదరాబాద్​,వెలుగు : జిల్లాల్లోని సర్కారు దవాఖానల్లో  సరైన సౌలతులు లేక పట్నంలోని పెద్దాస్పత్రులకు వచ్చే పేషెంట్లకు  సరిగా ట్రీట్​మెంట్ అందడం లేదు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని ఇన్​ పేషెంట్ గా అడ్మిట్ ​చేసుకోవడం లేదు. హాస్పిటల్స్​లో బెడ్స్​ ఖాళీగా ఉంటున్నా కోవిడ్ ​పేరుతో మెడిసిన్​ ఇచ్చి పంపిస్తున్నారు. ఇక్కడికొచ్చినా సరిగా చూడకపోతుండడంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్​కి వెళ్తున్నారు. కొన్ని  డిసీజెస్​కు సంబంధించిన ట్రీట్​మెంట్ ​కోసం హాస్పిటల్స్​కి తెల్లవారుజామున వెళితేనే టోకెన్​దొరికే పరిస్థితి ఉంది. నిమ్స్ లో రుమటాలజీ డిపార్టుమెంట్​లో ట్రీట్​మెంట్ ​పొందాలంటే పొద్దుగాల వచ్చి క్యూ కడితేనే ట్రీట్​మెంట్​అందుతుంది.  ఏ మాత్రం లేట్ అయినా వెనుతిరిగి వెళ్లాల్సిందే. ఈ విభాగానికి పేషెంట్లు వందల్లో వస్తుంటారు.  డైలీ 150 మందికి మాత్రమే చూస్తుండగా, చాలామంది వెనక్కి మళ్లి పోతున్నారు. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ హాస్పిటల్స్​ల్లోనూ అడ్మిట్​ చేసుకోవడం లేదని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలికాలం కావడంతో వారం నుంచి వైరల్‌‌ డిసీజెస్​ కేసులు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది.  ప్రధానంగా గొంతు నొప్పి, జ్వరం, ముక్కు కారడం, ఆస్తమా, సీవోపీడీ, బ్రాంకైటిస్‌‌, ఇతర ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారు ఆస్పత్రులకు వెళ్తున్నారు.

అడ్మిట్ చేసుకుంటలేరు

ప్రభుత్వాసుపత్రుల్లో పేషెంట్లని అడ్మిట్ చేసుకోవడంలేదు. ఎమర్జెన్సీ సర్జరీలు అయితేనే అడ్మిట్​చేసుకుంటున్నట్లు పేషెంట్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్​ హాస్పిటల్స్​లో మెడిసిన్స్ ఇచ్చే పంపిస్తున్నారు. దీంతో రోగులు రోజుల తరబడి హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నారు. గాంధీలో నాన్​ కోవిడ్​ సేవలు షురూ అయినప్పటికీ మేజర్​ సర్జరీలు మాత్రం చేయడం లేదు. ఇక్కడకు వచ్చే రోగుల్లోనూ కోవిడ్​ భయం ఇంకా పోవడంలేదు. మొన్నటి వరకు పూర్తిగా కోవిడ్​ పేషెంట్లు ఉండడంతో అడ్మిట్ అయితే పరిస్థితి ఏమైతదోనని ఆందోళన పడుతున్నారు.

పెరుగుతోన్న న్యుమోనియా కేసులు

నిలోఫర్​ పిల్లల హాస్పిటల్​కి వస్తున్న పేషెంట్లలో న్యుమోనియా కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.  ప్రతిరోజు 750మంది ఓపీకి వస్తుండగా, ఇందులో 40మంది న్యుమోనియాతో బాధపడుతున్న వారే ఉంటున్నారు. ప్రస్తుతం కోవిడ్​ కారణంగా వారికి ముందుగా కరోనా టెస్టులు చేసిన తర్వాతనే ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వింటర్ ​సీజన్​లో న్యుమోనియా కేసులు ప్రతి ఏటా వస్తుంటాయని డాక్టర్లు చెబుతున్నారు.

ఉదయం 6 గంటలకు వస్తేనే

నిమ్స్​లో మొన్నటి వరకు వెయ్యి లోపు పేషెంట్లు ఓపీకి వచ్చేది.  సోమవారం 1,609 మంది వరకు వచ్చారు. దీంతో పేషెంట్లకు ట్రీట్​మెంట్​చేయాలంటే లేటు అవుతోంది. రుమటాలజీ వింగ్​లో ఉదయం 7 దాటితే టోకెన్లు అందడం లేదు. డైలీ150మంది పేషెంట్లను మాత్రమే చూస్తుండగా మిగతావారు మరుసటి రోజు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా పేషెంట్లు రోజురోజుకూ పెరుగుతుండగా అన్ని విభాగాల్లో ట్రీట్​మెంట్​ లేటు అవుతుంది. సర్జరీల కోసం పేషెంట్లను అడ్మిట్ చేసుకోవడం లేదు. రోజుల తరబడి తిప్పించుకున్న తర్వాతనే అడ్మిట్ ​చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

తొమ్మిదింటికి వచ్చినా ఓపీ దొరకలె

నరాల జబ్బుతో బాధపడుతున్న మా ఫ్యామిలీ మెంబర్​  ని తీసుకొని తాండూరు​ నుంచి ఉదయం 9 గంటలకు నిమ్స్ కి వస్తే ఓపీ దొరకలే. అప్పటికే టోకెన్లు అయిపోయాయని, ఇంకో రోజు రమ్మని చెప్పిన్రు. దూరం నుంచి వచ్చేందుకు చార్జీలే ఎక్కువ అయితున్నయ్. చేసేదేం లేక ప్రైవేటు హాస్పిటల్​లో చూపించుకునేందుకు వెళ్తున్నం.‑ శ్రీనివాస్, పేషెంట్ బంధువు

అనుమానం వస్తే కరోనా టెస్ట్​లు

ట్రీట్​మెంట్​ కోసం హాస్పిటల్స్​కి వస్తుండగా అనుమానం ఉన్న వారికి కరోనా టెస్ట్​లు చేస్తున్నారు.  డైలీ పదుల సంఖ్యలో పాజిటివ్​కేసులు వస్తున్నాయి. నిమ్స్​ లో ప్రతిరోజు 50 మందికి టెస్టులు చేస్తుండగా, 5 నుంచి10 మందికి పాజిటివ్​ వస్తోంది. నిలోఫర్​కి వచ్చే చిన్నారులకు కూడా కరోనా పాజిటివ్​గా తేలుతోంది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్​ హాస్పిటళ్లకు వచ్చే పేషెంట్లలోనూ సస్పెక్టర్స్​కు టెస్టులు చేస్తుండగా అక్కడ కూడా పాజిటివ్​లు వస్తున్నాయి.  ఇలా పాజిటివ్​ వచ్చిన వారికి ఇతర  వైద్యసేవలు, ఎమర్జెన్సీ అయితే ఐసోలేషన్​వార్డులో ఉంచి ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. ఎమర్జెన్సీ కాకుంటే వెంటనే ఇంటికి పంపిస్తున్నారు.