కరోనా టెస్టు చేయించుకున్న మరుక్షణమే మృతి

కరోనా టెస్టు చేయించుకున్న మరుక్షణమే మృతి
  • మృతురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
  • ఆస్పత్రి వరండాలో గంటల తరబడి పడి ఉన్న వృద్ధురాలి శవం.. రోగులు,సందర్శకుల అవస్థలు

నిర్మల్ జిల్లా:  ఖానాపూర్ ప్రభుత్వ దవాఖానకు కరోనా టెస్ట్ కోసం వచ్చిన అల్లెపు ఎల్లవ్వ అనే వృద్ధురాలు తన వద్ద సిబ్బంది శాంపిల్ తీసుకున్న వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లి  చనిపోయింది. మృతి చెందిన ఎల్లవ్వకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో శవాన్ని తరలించకుండా గంటల తరబడి వరండాలోనే వదిలేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చిపోయే రోగులు.. చివరకు సిబ్బంది సైతం ఇబ్బందిపడ్డారు. పెద్ద వయసు వారందరూ కరోనా టెస్టులు చేయించుకుని.. వ్యాక్సిన్ వేయించుకోమని టామ్ టామ్ చేస్తున్న నేపధ్యంలో ఖానాపూర్ పట్టణంలోని సుభాష్ నగర్ కు చెందిన ఎల్లవ్వ జ్వరం రావడంతో ఉదయమే టెస్టు కొరకు ఆసుపత్రికి వచ్చింది. వైద్య సిబ్బంది ఆమె వద్ద కరోనా నిర్దారణకు శాంపిల్ తీసుకున్న మరు క్షణమే తీవ్ర అస్వస్థతకు గురైంది. వైద్యులు వచ్చి చికిత్స చేపట్టేలోగానే కళ్లు తేలేసి తుదిశ్వాస విడిచింది. దీంతో శవాన్ని ఆస్పత్రి వరండాలోనే ఉంచేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమెకు చేసిన శాంపిల్ లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనాతోనే ఎల్లవ్వ చనిపోయినట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. అయితే శవాన్ని ఎవరూ తరలించకపోవడంతో గంటల తరబడి తీవ్రంగా ఇబ్బందిపడ్డారు రోగులు, సందర్శకులు. కరోనాతో చనిపోయిన వృద్ధురాలి శవాన్ని తరలించకుండా ప్రధాన ద్వారం పక్కన వరండాలనే వదిలేయడంతో ఆందోళన వ్యక్తం చేశారు.