పల్లె,పట్టణ ప్రగతిలో మంత్రులు,ఎమ్మెల్యేలకు నిరసన సెగ

పల్లె,పట్టణ ప్రగతిలో మంత్రులు,ఎమ్మెల్యేలకు నిరసన సెగ
  • కొన్ని చోట్ల గ్రామసభల బహిష్కరణ
  • ‘డబుల్’ ఇండ్లు ఏమయ్యాయంటూ మంత్రి హరీశ్​ను ప్రశ్నించిన మహిళలు
  • మల్లారెడ్డికి నిరసన సెగ.. భూముల విషయంలో న్యాయం కోసం డిమాండ్
  • పాత సమస్యలే పరిష్కరించలేదంటూ ఎమ్మెల్యేలపై జనం ఆగ్రహం
  • ఫండ్స్ ఇస్తలేరంటూ రూలింగ్ పార్టీ ఎంపీటీసీల నిరసనలు

రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా మొదలు పెట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో మొదటి రోజే నిరసనలు వెల్లువెత్తాయి. గురువారం ప్రారంభమైన గ్రామసభల్లో ప్రజాప్రతినిధులను, ఆఫీసర్లను సమస్యలపై ప్రజలు నిలదీశారు. మంత్రులను అడ్డుకున్నారు. కొన్నిచోట్ల గ్రామసభలను బహిష్కరించారు. తమకు ఫండ్స్ ఇవ్వడం లేదంటూ రూలింగ్ పార్టీ ఎంపీటీసీలే గోడు వెళ్లబోసుకున్నారు. మొదటి రోజే అన్నివైపుల నుంచి వ్యతిరేకత రావడం అధికార పార్టీ లీడర్లను కలవరపరుస్తోంది.

విద్యుత్ మంత్రి ఇలాకాలో.. 

సూర్యాపేట జిల్లాలో విద్యుత్ మంత్రి జగదీశ్​రెడ్డి సొంత గ్రామం నాగారంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ ఎంపీపీ, సర్పంచ్​లపై స్థానికులు విరుచుకుపడ్డారు. భగీరథ ద్వారా కలుషితమైన నీళ్లు వస్తున్నా పట్టించుకోవడం లేదని, ఈజీఎస్ పనుల్లో టీఆర్ఎస్ లీడర్లు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. జగదీశ్ రెడ్డి నియోజకవర్గంలోని చివ్వెంల మండలం ఐలాపురంలో కరెంట్ కష్టాలను ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లో వోల్టేజితో ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు లైన్​మన్ రాకేశ్‌‌ను పంచాయతీ ఆఫీసులో నిర్బంధించారు. 

  • మునగాల మండలం వెంకటరామాపురంలో గ్రామసభకు ప్రజల స్పందన కరువైంది. 800 జనాభా ఉన్న ఊరిలో పది మంది కూడా సభకు రాలేదు. మునగాల మండల కేంద్రంలోనూ సర్పంచ్, అంగన్‌‌వాడీ టీచర్, ఆశ కార్యకర్త, పంచాయతీ కార్యదర్శి మాత్రమే పాల్గొనగా సభలో ఖాళీ కుర్చీలే కనిపించాయి.
  • నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ 35 వార్డులో జరిగిన పట్టణప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్​రావును డబుల్ బెడ్​రూం ఇండ్ల కోసం స్థానికులు నిలదీశారు. స్థలాన్ని ఖరారు చేశామని, త్వరలో ఇండ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆలగడపలో సర్పంచ్ చెన్నబోయిన శ్రీనివాస్ ను స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం డిమాండ్ చేశారు.
  • ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడిలో స్థానికులు గ్రామసభ బహిష్కరించారు. తమ సమస్యలపై సర్పంచుకు వినతిపత్రాన్ని ఇచ్చారు. టైమ్​కు వార్డు మెంబర్లు రాకపోవడంతో కోరం లేదని గ్రామసభను ఆఫీసర్లు వాయిదా వేశారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ప్రజలు రాక గ్రామసభ వెలవెలబోయింది. ఖాళీ కుర్చీలే కనిపించాయి. చండ్రుగొండలో సర్పంచు లక్ష్మీభవాని కూడా గ్రామసభకు హాజరుకాలేదు. ఆమె కోసం ఆఫీసర్లు రెండు గంటలపాటు ఎదురుచూసి వెళ్లిపోయారు.
  • మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో గ్రామసభకు ప్రజలు హాజరుకాలేదు. 11.30 దాకా ఎవరూ రాకపోవడంతో అంగన్‌‌వాడీ కార్యకర్తలు, వార్డు మెంబర్, ఆమె భర్త, ఇద్దరు గ్రామస్తులకు పల్లెప్రగతి రిపోర్టు ఎంపీడీవో చదివి వినిపించారు.

మంత్రి హరీశ్‌‌ను నిలదీసిన మహిళలు

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం గ్రామంలో మంత్రి హరీశ్‌‌‌‌ రావుకు చేదు అనుభవం ఎదురైంది. పల్లె ప్రగతి గ్రామ సభలో మహిళలు సమస్యలపై గొంతెత్తారు. ప్రసంగం ముగించుకుని హరీశ్‌‌‌‌ రావు వెళ్లిపోతుండగా.. కొంత మంది మహిళలు ఆయన వెనుకే వెళ్లారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఏమయ్యాయని నిలదీశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో గ్రామానికి చెందిన కొందరి భూములు కోల్పోయారని, వారికి గతంలో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇవేమీ పట్టించుకోకుండా ముందుకు కదిలారు. తన వెహికల్‌‌లో హరీశ్ వెళ్తుండగా కొందరు మహిళలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో వారికి నమస్కారం చేస్తూ వెళ్లిపోయారు. కొండపాక పర్యటన తర్వాత పొన్నాల, బూర్గుపల్లిలోనూ మంత్రి హరీశ్ రావు పాల్గొనాల్సి ఉంది. కానీ వాటిని రద్దు చేసుకోవడం గమనార్హం.

పాత సమస్యలే పరిష్కరించలే.. 

వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో నిర్వహించిన గ్రామసభలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ రూరల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతిని మండల అభివృద్ధిపై స్థానికులు నిలదీశారు. గతంలో తాము ప్రస్తావించిన సమస్యలే పరిష్కరించలేదని, మళ్లీ సభ ఎందుకని ప్రశ్నించారు. ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామసభలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. రోడ్డు వెడల్పు వల్ల ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్న హామీ మరిచిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్టు షాపులతో ఎదుర్కొంటున్న కష్టాల గురించి మహిళలు, తమ సమస్యలపై 
ఆశా వర్కర్లు నిలదీశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్​కు నిరసన ఎదురైంది. ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని ఎంహెచ్‌‌నగర్​ వాసులు నిలదీశారు.

మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో కొత్తగా నిర్మించబోతున్న రాచకొండ కమిషనరేట్​లో మొక్కలు నాటేందుకు వచ్చిన మంత్రి మల్లారెడ్డి, కమిషనర్ మహేశ్​భగవత్, కలెక్టర్ శ్వేతా మహంతిని దళిత రైతులు అడ్డుకున్నారు. మేడిపల్లిలోని సర్వే నంబర్​62లో గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన 116 ఎకరాలను హెచ్ఎండీఏ ల్యాండ్​పూలింగ్ స్కీం కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అందులోని 56 ఎకరాలను రాచకొండ కమిషనరేట్​కు కేటాయించింది. సుమారు నాలుగేళ్లవుతున్నా భూములు కోల్పోయిన రైతులకు ల్యాండ్ పూలింగ్ అగ్రిమెంట్ ప్రకారం డెవలప్ చేసి ప్లాట్లు ఇవ్వకపోవడంతో రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఈక్రమంలో గురువారం మొక్కలు నాటేందుకు మంత్రి మల్లారెడ్డి రావడంతో బాధిత రైతులు అడ్డుకున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రైతులను అదుపులోకి తీసుకొన్నారు.