భయంతో పొరుగు దేశాలకు వెళ్తున్న ఉక్రెయిన్ ప్రజలు

భయంతో పొరుగు దేశాలకు వెళ్తున్న ఉక్రెయిన్ ప్రజలు
  • ఉక్రెయిన్​  నుంచి వెళ్లిపోతున్న ప్రజలు
  •  ఒక్క పోలెండ్​కే 2.8 లక్షల మంది

బుడాపెస్ట్: రష్యా దాడి ప్రారంభించినప్పుటి నుంచి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. పొరుగు దేశాలవైపు వెళ్లిపోతున్నారు. ఇప్పటివరకు 5.20 లక్షల మందికిపైగా ఉక్రెయిన్​ను విడిచి వెళ్లిపోయినట్లు యునైటెడ్ నేషన్స్(యూఎన్) మంగళవారం వెల్లడించింది. ఈ సంఖ్య గంటగంటకూ విపరీతంగా పెరుగుతోందని, రాబోయే రోజుల్లో 40 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఉక్రెయిన్​లో ఉన్న చాలామంది కార్లు, బస్సులలో పోలెండ్, హంగేరి, స్లోవేకియా, రుమేనియా, మాల్దోవా బార్డర్లకు చేరుకుంటున్నారు. మరికొంత మంది పిల్లాపాపలతో కాలినడకన సరిహద్దులు దాటుతున్నారు. ఇందులో ఒక్క పోలాండ్​లోకే 2.8 లక్షల మంది  వచ్చారని అక్కడి అధికారులు వెల్లడించారు. ఉక్రెయిన్ సిటిజన్లతో పాటు ఉజ్బెకిస్తాన్, నైజీరియా, ఇండియా, మోరాకో, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, ఇరాన్, ఇరాక్, టర్కీ, అల్జీరియా తదితర 125 దేశాలకు చెందినోళ్లు తమ దేశంలోకి వచ్చారని పోలాండ్ అంబాసిడర్ క్రిజిస్​టోఫ్ యూఎన్​ సమావేశంలో వెల్లడించారు. ఎంతో మంది చెక్​పోస్టులకు చేరుకోగా వాళ్లందరినీ పోలెండ్‌లోకి రైళ్లలో తరలిస్తున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వేలాదిమంది శరణార్థులు హంగేరి బార్డర్​లో వేచి ఉన్నారని హంగేరి ఎంబసీ అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలామందిని బార్డర్​నుంచి డెబ్రేసన్, బుడాపెస్ట్  ఎయిర్​పోర్టులకు తీసుకొచ్చి వాళ్లవాళ్ల దేశాలకు తరలిస్తున్నామని చెప్పారు.  సిరియా నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు రావడం సమస్యగా మారినందున మరెవ్వరికీ ఆశ్రయం ఇవ్వకూడదని గతంలో పోలెండ్, హంగేరీ వంటి దేశాలు కఠిన వైఖరిని పాటించాయి. ప్రస్తుతం రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశాలు తమ విధానాన్ని సడలించుకుని ఉక్రెయిన్ నుంచి వచ్చేటోళ్లకు ఆసరాగా నిలుస్తున్నాయి. బార్డర్లలో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. తిండి, నీళ్లు, మెడిసిన్ వంటివి అందజేస్తున్నాయి.