ప్రజా సమస్యలపై ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలె: జేడీ

ప్రజా సమస్యలపై ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాలె: జేడీ

ప్రభుత్వ కార్యాలయాలలో 50% అధికారుల పనితీరు అధ్వానంగా ఉందని ప్రజా సమస్యలను తెలిపేందుకు ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలలో అధికారుల అవినీతి, నాయకుల పని తీరుపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ 45 రోజుల పాటు సర్వే నిర్వహించింది. యూత్ ఫర్ యాంటీ కరప్షన్ పౌండర్ రాజేంద్ర పల్నాటి అధ్యక్షతన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు సర్వే రిపోర్టును రిపోర్టు విడుదల చేశారు. 

గత పది సంవత్సరాల నుంచి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాజంలో మార్పు కోసం వినూత్న కార్యక్రమాలు చేస్తోందని జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.  సమాచార హక్కు చట్టాన్ని ఆయుధంగా మార్చుకొని గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. నిజాయితీ అధికారులను, నాయకులను గుర్తించి సత్కరిస్తూ వారికి అండగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఉంటోందన్నారు. సర్వేలో గవర్నమెంట్ అధికారులకు  లంచం ఇవ్వకపోతే 28 శాతం ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారని తేలిందని పేర్కొన్నారు. 26 వేల 211 మంది సర్వేలో పాల్గొన్నారని తమకు తెలియచేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా కాంపిటేషన్ ఉంటోందని తెలిపారు.

ఆఫీసులకు వెళితే లంచం అడుగుతున్నారని సర్వేలో తేలిందన్నారు. ఆఫీసుకు సంబంధం లేని ఇద్దరిని అక్కడ నియమించి..వచ్చిన వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం ఉందని..ఇందుకు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఒక నెంబర్ కేటాయించడం వల్ల ప్రజల్లో అవగాహన ఏర్పడుతుందన్నారు. అవినీతిని తగ్గించడానికి ఏమి చేయాలో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సూచనలు చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ సూచనలను కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే... ప్రభుత్వ డిపార్ట్ మెంట్ లకు నోటీసులు అందిస్తుందని.. ఎలాంటి అభిప్రాయం వెల్లడిస్తారో తెలియచేయాలని కోర్టు అడుగుతుందన్నారు. అవినీతిపై అందరూ సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.