మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్

హైదరాబాద్‌, వెలుగు: మహారాష్ట్రలో శివసేన నేతపై కాల్పులు జరిపి పారిపోయి సిటీలో షెల్టర్ తీసుకుంటున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను బహదూర్ పురా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14న బహదూర్ పురాలో జరిగిన హత్య కేసులోనూ అతడు రెండో నిందితుడిగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సోమవారం పురానీ హవేలీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ జోన్ డీసీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. బహదూర్ పురాలోని హసన్ నగర్ ఉక చెందిన జరీనా బేగం(32) రాజేంద్రనగర్ కు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ జుబైర్(38)ను రెండో పెళ్లి చేసుకుంది. అదే ప్రాంతానికి చెందిన మరో రౌడీషీటర్ మహ్మద్ బాబుఖాన్(40)తో జుబైర్ కు బిజినెస్ కు సంబంధించిన వివాదాలు ఉన్నాయి. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు ఎక్కువ కావడంతో బాబుఖాన్ ను హత్య చేయాలని జరీనాబేగం, జుబైర స్కెచ్ వేశారు. ఈ నెల 14న హసన్ నగర్ లోని సలీమా హోటల్ వద్దకు బాబుఖాన్ ను పిలిపించారు. అర్దరాత్రి జుబైర్ తో పాటు మరో ఐదుగురు అతడిపై కత్తులు, కర్రలతో దాడి చేసి చంపారు. బాబుఖాన్ భార్య మెరాజ్ బేగం ఇచ్చిన కంప్లయింట్ తో బహదూర్ పురా పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. జుబైర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో దొరికిండు 

బాబుఖాన్‌ హత్య కేసులో రెండో నిందితుడు రాహుల్ రాజు తడాస్ అలియాస్ రాఖీ(32) మహారాష్ట్ర పోలీసులకు వాంటెడ్ క్రిమినల్ గా గుర్తించారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా శివసేన వైస్ ప్రెసిడెంట్ యోగేశ్ గరాడ్ పై ఈ ఏడాది ఏప్రిల్ 23న రాహుల్ రాజ్ కాల్పులు జరిపాడు. ఈ కేసులో మరో ఇద్దరితో పాటు రాహుల్ రాజుపై వరద్ పీఎస్‌లో కేసు నమోదైంది. యోగేష్‌పై కాల్పులు జరిపి బైక్‌పై ఎస్కేప్  అయిన  రాహుల్‌ రాజు అక్కడి నుంచి సిటీకి  వచ్చాడు. జబైర్‌‌ గ్యాంగ్‌లో చేరాడు. 5 నెలలుగా సిటీలో నేరాలకు పాల్పడుతున్నాడు. ఓల్డ్‌సిటీలోని పహాడీషరీఫ్‌కు చెందిన ఉమర్ ఖాన్(28), మహ్మద్ ఖదీర్‌‌(39), రాజేంద్రనగర్‌‌ ‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్‌(26)తో కలిసి బాబుఖాన్‌ను హత్య చేశారు. రాహుల్ రాజుపై మహారాష్ట్రలో 5 క్రిమినల్ కేసులున్నట్లు బహదూర్ పురా పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర పోలీసులకు సమాచారం అందించారు. బాబుఖాన్ హత్యకేసులో నిందితులైన జుబైర్, జరీనా, రాహుల్ రాజ్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరి నుంచి 4 కత్తులు, 2 కంట్రీమేడ్ పిస్టల్స్, 6 బుల్లెట్లు, ఆటో, బైక్ స్వాధీనం చేసుకున్నారు.