పల్లెల్లో మళ్లా గుడుంబా..సేల్స్ చేస్తున్న బెల్ట్ షాపులు

పల్లెల్లో మళ్లా గుడుంబా..సేల్స్ చేస్తున్న బెల్ట్ షాపులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో గుడుంబా గుప్పుమంటోంది. జిల్లాల్లో సారా ఏరులై పారుతోంది. గుట్టు చప్పుడుకాకుండా పెద్దగా ఎత్తున తయారు చేస్తున్నారు. భారీగా అమ్మకాలు సాగిస్తున్నారు. కరోనా ప్రభావంతో చేతిలో పెద్దగా డబ్బులు లేకపోవడం, లిక్కర్ రేట్లు 20 శాతం వరకు పెరగడంతో జనం సారా వైపు మళ్లుతున్నారు. తక్కువ ధరకు దొరుకుతుండటంతో ఎక్కువగా కొంటున్నారు.

రూ.80కే లీటర్

మార్చి 22 నుంచి మే 5వ తేదీ వరకు వైన్స్ బంద్ అయ్యాయి. ఆ టైంలో కొందరు గుడుంబాకు అలవాటు పడ్డారు. సర్కారు మే 6 నుంచి వైన్స్ ఓపెన్ చేసింది. కరోనా సాకు చూపుతూ సగటున 16 శాతం వరకు మద్యం రేట్లు పెంచింది. అధికారికంగా 16 శాతం అని చెప్పినా 20 శాతం వరకు పెంచింది. దీంతో క్వార్టర్ పై రూ.20 దాకా ఎక్కువ పెరిగింది. మరోవైపు కరోనాతో అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఎంతో మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. అనేక సంస్థలు రెండు, మూడు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు. కొన్నిసంస్థలు కోతలు పెట్టాయి. కార్మికులంతా సొంత రాష్ర్టాలకు వెళ్లిపోయారు. జనం చేతిలో డబ్బులు పెద్దగా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వందలకు వందలు పెట్టి లిక్కర్ తాగడంలేదు. అయితే తాగడం మాత్రం వదిలిపెట్టలేదు. ప్రత్యామ్నాయంగా గుడుంబాను ఎంచుకుంటున్నారు. సారా అయితే రూ.60 నుంచి 80కి లీటర్ వస్తుంది. అదే చీప్ లిక్కర్ అయితే క్వార్టర్ కే రూ.120 దాకా అవుతోంది.

పల్లెల్లోనే ఎక్కువ

ప్రస్తుతం గుడుంబా తయారీ, విక్రయాలు బాగా పెరిగిపోయాయి. సారా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తయారు చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. బెల్ట్‌‌ షాపు నిర్వాహకులతోపాటు మరికొందరు సీక్రెట్‌‌గా అమ్మకాలు జరుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌‌, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎక్కువగా తయారు చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలల డేటా చూస్తే ఆదిలాబాద్ లో 565, కరీంనగర్ లో 510, వరంగల్ లో877, మహబూబ్ నగర్ లో 692 సారా కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి (218), హైదరాబాద్ (125) జిల్లాల్లో కూడా కేసులు పెట్టారు. కొత్త జిల్లాల వారీగా చూస్తే నాగర్ కర్నూల్ 283, మహబూబాబాద్ 266 కేసులు బుక్ అయ్యాయి. రాష్ర్టవ్యాప్తంగా గత రెండు నెలల్లో 3,450 కేసులు నమోదయ్యాయి. 2,800 మందిని అధికారులు అరెస్ట్ చేశారు. 15 వేల లీటర్ల సారా స్వాధీనం చేసుకోగా, 2.5 లక్షల బెల్లం పానకం, 1.52 లక్షల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.

యూరియాతో తయారీ!

రాష్ట్రంలో గుడుంబా నిషేధంలో ఉంది. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా ప్రభుత్వం ప్రకటించింది. కానీ లాక్‌‌డౌన్‌‌తో గుడుంబా మళ్లీ తెరపైకి వచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా సారా తయారు చేస్తున్నారు. రహస్యంగా బట్టీలు పెడుతున్నారు. గతంలో బెల్లం, పట్టికతో తయారు చేసేవాళ్లు. ఇప్పుడు కొంతమంది యూరియాతో కూడా తయారు చేస్తున్నారు.

లిక్కర్ సేల్స్ పెరగలే

రాష్ర్టంలో లిక్కర్ సేల్స్ పెరగలేదు. వైన్స్ ఓపెన్ చేసిన తొలి వారంలో బాగానే ఉన్నా ఆ తర్వాత నెమ్మదించాయి. ఈనెల 8వ తేదీ వరకు రూ.550 కోట్లు మాత్రమే సేల్స్ జరిగాయి. అంటే సగటున రోజుకు 73 కోట్లు వచ్చింది. 20 శాతం రేట్లు పెంచక ముందు కూడా ఇంతకంటే ఎక్కువగా సేల్స్ జరిగేవి. గతేడాదితో పోలిస్తే ఈ సారి 40 శాతం వరకు బీర్ సేల్స్ పడిపోయాయి. గతేడాది 13 లక్షల కేసుల బీర్లు అమ్ముడవగా, ఈసారి 8 లక్షల కేసులు మాత్రమే సేల్ అయ్యాయి. ఐఎంఎల్ సేల్స్ కూడా ఈ సారి తక్కువగానే జరిగాయి.