శోభయాత్ర సందర్భంగా భద్రత కట్టుదిట్టం

శోభయాత్ర సందర్భంగా భద్రత కట్టుదిట్టం

భైంసా, వెలుగు: భైంసా పట్టణంలో గణేశ్​ ఉత్సవాలపై పోలీసు శాఖ ప్రత్యేక ఫోకస్​ పెట్టింది. పట్టణంలో సుమారు 200కు పైగా గణపతులను ప్రతిష్ఠించారు. ఈ నెల 8న నిమజ్జన శోభయాత్ర సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎస్పీ ప్రవీణ్​ కుమార్​, ఏఎస్పీ కిరణ్​ ఖారేల ఆధ్వర్యంలో నిఘా పటిష్ఠం చేశారు. ప్రార్థన మందిరాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్​ పికెటింగ్​ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలపై పోలీసులు కన్నేశారు. సుమారు 600 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నియమించారు. నలుమూలల చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు.

లా అండ్ ఆర్డర్​పై నజర్.. 

గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ లాఅండ్​ఆర్డర్​పై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో వినాయక, దుర్గమాత ఉత్సవాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగి, రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో భైంసాలో ఏ ఉత్సవం జరిగినా పోలీసులు అలర్ట్​అవుతున్నారు. భైంసా పట్టణమంతా సుమారు 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. శోభాయాత్రలో డీజేలకు పర్మిషన్​ లేదని, ఎవరూ ఏర్పాటు చేయవద్దని ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే శాంతి కమిటీ సమావేశాలు సైతం నిర్వహించారు.

దుబాయ్ లో గణేశ్ ఉత్సవాలు

జన్నారం, వెలుగు: ఎడారి దేశం దుబాయ్ లో గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు తెలంగాణ గల్ఫ్​కార్మికుల సంక్షేమ సమితి వ్యవస్థాపకుడు కల్లెడ భూమయ్య తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా గణేశుడిని ప్రతిష్టించి నిత్య పూజలు చేశామని ఆదివారం సాయంత్రం నిమజ్జనం చేసినట్లు భూమయ్య చెప్పారు. 

ప్రజలు సహకరించాలి

భైంసాలో గణేశ్​ నవరాత్రులు,​ నిమజ్జన శోభయాత్ర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నాం. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలి. ఇన్​టైంలో శోభయాత్ర ముగించుకోవాలి.
 -  కిరణ్​ ఖారే,  ఏఎస్పీ