ధాన్యం కొంటలేరని ధర్నా చేస్తే..రైతులపై లాక్ డౌన్ కేసు

ధాన్యం కొంటలేరని ధర్నా చేస్తే..రైతులపై లాక్ డౌన్ కేసు

మెదక్ /వెల్దుర్తి, వెలుగు: లాక్​డౌన్ అమలులో ఉండగా రాస్తారోకో చేశారంటూ మెదక్​ జిల్లా వెల్దుర్తి రైతుల మీద   పోలీసులు కేసు పెట్టారు. మెదక్​ జిల్లా వెల్దుర్తిలో వడ్లను వెంటనే కొనాలంటూ రైతులు రాస్తారోకో చేశారు.  వెల్దుర్తి, ఆరెగూడెంలకు చెందిన రైతులు ధాన్యాన్ని తేగా, శుభ్రం చేసిన తర్వాతే కాంటా పెడతామని సెంటర్​ నిర్వాహకులు చెప్పడంతో ఆగ్రహంతో రోడ్డు మీద బైఠాయించారు. పొలం దగ్గరే శుభ్రం చేసి తీసుకు వచ్చినా తాలు ఉందనడం ఏమిటని వాపోయారు. తేమ పేర కూడా ఇబ్బంది పెడుతున్నారని, 13శాతం తేమ ఉన్నా కొనాలని అన్నారు. లాక్ డౌన్ ఉన్నందున ఆందోళన చేయడానికి  వీలు లేదని, అధికారులతో మాట్లాడుకోవాలని పోలీసులు నచ్చజెప్పడంతో రైతులు అక్కడనుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎలాంటి పర్మిషన్ లేకుండా లాక్​డౌన్​ నిబంధనలకు వ్యతిరేకంగా మెయిన్ రోడ్డు మీద ఆందోళనకు దిగారంటూ రైతుల మీద ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెల్దుర్తి పీఎస్​లో కేసు నమోదు చేశారు.  ఫోటోలు, వీడియో క్లిప్పింగులు పరిశీలించి ఆందోళనలో పాల్గొన్న వారిని గుర్తిస్తామని, వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని  వెల్దుర్తి ఎస్సై గంగరాజు చెప్పారు.

 పురుగుల మందు డబ్బాలతో నిరసన

జగిత్యాల, వెలుగు: కరోనా కాలంలో ఇబ్బందులు పెడుతున్నారంటూ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ల్యాగలమర్రి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. 12 రోజుల కిందటే వడ్లను తెచ్చామని, వారం కింద సెంటర్ ను ఓపెన్ చేసిన అధికారులు తాలు ఉందని కొనడం లేదన్నారు. తూర్పార పడదామంటే సెంటర్  దగ్గర కరెంట్  ఉండడం లేదని వాపోయారు. విషయం తెలిసి జగిత్యాల జడ్పీ సీఈవో శ్రీనివాస్, తహసీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, అగ్రికల్చర్  జేడీ రామ్ చందర్ అక్కడకు చేరుకున్నారు. మిల్లర్లు వడ్లను తీసుకోకపోవడం వల్ల కొనుగోలు చేయడం లేదని, కలెక్టర్  మిల్లర్లతో మాట్లాడుతున్నారని అధికారులు చెప్పారు. పంటను చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చారు. తాలు పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ ధర్మపురి మండలంలోని నర్సయ్య పల్లె స్టేజి వద్ద,  వెల్గటూరు మండలం స్తంభంపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర కూడా రైతులు నిరసనకు దిగారు .