పోలీసులకు కొట్టే హక్కు ఎక్కడిది? : : అక్బరుద్దీన్​

పోలీసులకు కొట్టే హక్కు ఎక్కడిది? : : అక్బరుద్దీన్​
  •  రాత్రికాగానే పాత బస్తీలో లాఠీలతో విరుచుకుపడుతున్నరు 

హైదరాబాద్, వెలుగు: పోలీసులు రాత్రి కాగానే లాఠీలు పట్టుకుని వచ్చేస్తున్నారని, సామాన్యులు ఇంటి ముందు రోడ్డుపై నిలబడినా కొడుతున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. కొట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నారని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​ లేదంటూ మైకులు పట్టుకుని చెప్తున్నారని, మరి, ఇది రౌడీ పోలీసింగా అని నిలదీశారు.

 సోమవారం ఆయన సభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో నేరాల రేటు 9 శాతం పెరిగిందన్నారు. మధ్యాహ్నం హత్యలు జరుగుతున్నా పట్టించుకోకుండా.. రాత్రి పూట మాత్రం పోలీసింగ్ చేస్తున్నారని విమర్శించారు. టాస్క్​ఫోర్స్ పోలీసులు చేయాల్సిన పనిని కాకుండా ఇతర అంశాలపై దృష్టి పెట్టారన్నారు. అర్ధరాత్రి పోలీసులు చేస్తున్న జులుంపై కోర్టులో పిల్​ వేస్తానని, దానికి హరీశ్ రావు సహకరించాలని కోరారు. పోలీసులు సామాన్యులను కొడితే తాను అడ్డంగా నిలబడతానని, పాతబస్తీ వాసులంతా తన బిడ్డలేనని స్పష్టం చేశారు. పోలీసులకు తెలియకుండానే సిటీలో డ్రగ్స్ వస్తున్నాయా అని ప్రశ్నించారు.

‘ప్రొహిబిషన్’ పదం తీసేద్దాం

రాష్ట్రంలో గాంధీజీ చెప్పిన మద్య నిషేధాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్​డిమాండ్ చేశారు. ప్రతి పార్టీకీ మద్యం ఆదాయ వనరుగా మారిందని అన్నారు. దానిని నిషేధించాలనే చిత్తశుద్ధి ఎవరికీ లేదన్నారు. నిషేధమే లేనప్పుడు ‘ప్రొహిబిషన్’ అనే పదం ఎందుకని, ఆ పదాన్ని తొలగించి ఎక్సైజ్​ శాఖగా మార్చాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని గడా (జీఏడీఏ), సీఎం రేవంత్​ రెడ్డి తన కొడంగల్​ నియోజకవర్గానికి కడా (కేఏడీఏ) పేరిట డెవలప్​మెంట్​ అథారిటీలను ఏర్పాటు చేసుకున్నారని, ప్రత్యేక ఫండ్​ను కేటాయించుకుంటున్నారని అన్నారు. మరి, మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కరెంట్ నష్టాలు మా వల్ల కాదు

రాష్ట్రంలో కరెంట్ నష్టాలు పాతబస్తీ వాసుల వల్ల జరగడం లేదని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. రాష్ట్రంలో కరెంట్ నష్టాలు 20 శాతమని చెప్పారు. మాటెత్తితే ఓల్డ్ సిటీలో కరెంట్ చౌర్యం జరుగుతున్నదని అంటున్నారని, నిజంగా జరుగుతున్నదో.. లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే ప్రశ్నను అడిగితే ఓల్డ్​ సిటీలో కరెంట్ చోరీ జరగడం లేదని మంత్రి సమాధానం చెప్పారన్నారు. 

మూసీ డెవలప్ అయితే మాకూ మంచిదే

మూసీని అభివృద్ధి చేస్తే తమకూ మంచిదేనని, చాలా మందికి ఉపాధి దొరుకుతుందని అక్బరుద్దీన్ చెప్పారు. అంతకన్నా ముందు మూసీ సరిహద్దులను నిర్ధారించాలని, ఎన్ని నిర్మాణాలను తీసేయాల్సి వస్తుందో చెప్పాలని, పరిహారం ఎంతిస్తారో నిర్ణయించాలని డిమాండ్​ చేశారు. ఓల్డ్ సిటీలో మెట్రోను విస్తరించడానికి ముందు రోడ్లను విస్తరించాలని సూచించారు.

బీఆర్ఎస్ విద్యను పట్టించుకోలే

బీసీలను పదేండ్ల పాటు బీఆర్ఎస్ పాలకులు పట్టించుకోలేదని, అందుకే వారిని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని అక్బరుద్దీన్​ఒవైసీ అన్నారు. ఏ కార్పొరేషన్​నూ పట్టించుకోలేదన్నారు. విద్యనూ గాలికొదిలేశారన్నారు. 16 లక్షల మంది స్కూల్స్ నుంచి డ్రాపవుట్ అయ్యారన్నారు. ప్రైవేటు స్కూళ్లపై అధికారులు కక్ష సా ధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.