- ఇటీవల పంచాయతీలకు మొదటి విడత నిధులు
- బిల్లులు, జీతాలకే చాలవంటున్న సెక్రటరీలు
- పాత బకాయిలు క్లియర్ చేయాలంటున్న మాజీ సర్పంచులు
- అభివృద్ధి పనులకే పెడ్తామంటున్న కొత్త సర్పంచులు
- నిధుల వినియోగంపై సర్కారు నుంచి నో క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: రెండేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీలకు వచ్చిన నిధుల కోసం ఇటు సెక్రటరీలు, అటు కొత్త, పాత సర్పంచుల నడుమ పంచాయితీ మొదలైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు రూ. 277 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే! ఒకట్రెండు రోజుల్లో ఈ ఫండ్స్ పంచాయతీ ఖాతాల్లో జమకానున్నాయి. రాక రాక వచ్చిన ఈ నిధులు తమకంటే తమకే కేటాయించాలంటూ పంచాయతీ సెక్రటరీలు, కొత్తసర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరికి వారే పట్టుబడుతున్నారు. సర్కారు నుంచి గైడ్‌లైన్స్ రాకపోవడంతో ఈ నిధులు ఎవరికి కేటాయిస్తారనే చర్చ జరుగుతున్నది.
పంచాయతీలకు చివరిసారి 2023 సెప్టెంబర్‌లో ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి.తర్వాత మల్టీపర్సస్ వర్కర్లకు జీతాల కోసం తప్ప అభివృద్ధి పనులకు ఎలాంటి ఫండ్స్రాలేదు. కాగా, బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి లో భాగంగా మాజీ సర్పంచ్‌లు.. శ్మశాన వాటికలు, విలేజ్ పార్కులు, రైతువేదికలు, సెగ్రిగేషన్ షెడ్లు .. తదితర నిర్మాణాలు చేపట్టారు. వీటికి సంబంధించి గత ప్రభుత్వం సుమారు రూ.531 కోట్ల దాకా బిల్లులు పెండింగ్ పెట్టింది. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకపోవడంతో అవి కాస్తా తడిసి మోపెడయ్యాయి. ఈ క్రమంలో పలువురు ఆత్మహత్య కూడా చేసుకున్నారని, తాజాగా విడుదలైన నిధులను తమకు కేటాయిస్తే అప్పులు కట్టుకుంటామని మాజీ సర్పంచులు చెప్తున్నారు. ప్రస్తుత నిధులు 2023–-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవని, అందువల్ల వాటిని తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముందు పాత బకాయిలు క్లియర్ చేయాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. పాత బాకీలు తీర్చకుండా కొత్త పనులు ఎలా చేస్తారని ఆఫీసర్లను నిలదీస్తున్నారు.
రెండేళ్లుగా జేబుల్లోంచే ఖర్చు పెట్టామంటున్న సెక్రటరీలు..
2023 ఫిబ్రవరి 1 నుంచి పల్లెలు ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చాయి. అప్పటి నుంచి పంచాయతీల్లో మెయింటెన్సెన్కోసం కార్యదర్శులే తమ జేబుల్లోంచి ఖర్చు పెడ్తున్నారు. అప్పులు తెచ్చి మరీ పారిశుధ్య పనులు నిర్వహించామని, డీజిల్‌కు, ట్రాక్టర్ ఈఎంఐలుకు పెద్దమొత్తంలో ఖర్చు చేశామని చెప్తున్నారు. చిన్న పంచాయతీల్లో దాదాపు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు, పెద్ద పంచాయతీల్లో రూ.5 నుంచి 10 లక్షల వరకు పెట్టామని, తమ జీతాలను సైతం ఇందుకే వినియోగించామని వాపోతున్నారు. అందువల్ల ఇటీవల విడుదలైన నిధులను తమకే కేటాయించాలని సెక్రటరీలు కోరుతున్నారు.
హామీలిచ్చాం.. అభివృద్ధి చేయాలంటున్న కొత్త సర్పంచులు..
మరోవైపు కొత్తగా గ్రామాల్లో కొలువుదీరిన సర్పంచులు ఈ నిధులపై భారీ ఆశలే పెట్టుకున్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, గ్రామాల్లో కొత్త రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులకు ఈ నిధులు ఖర్చు చేస్తామని కొత్త సర్పంచులు అంటున్నారు. ఈ నిధులను పాత బకాయిలకు కేటాయిస్తే.. కొత్త పనులు ఎలా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. రూ. 277 కోట్లు పూర్తిగా అభివృద్ధి పనులకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పంచాయతీల కోసం కేటాయించిన నిధులను అభివృద్ధి పనుల కోసమే వినియోగించాలని, పెండింగ్ బకాయిలు, సెక్రటరీలకు కేటాయించడానికి వీల్లేదంటున్నారు. ఈ నిధులను దారి మళ్లించేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని తేల్చి చెప్తున్నారు. కాగా, ముగ్గురి మధ్య నడుస్తున్న ఈ పంచాయతీతో మండల, జిల్లా స్థాయి ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన రూ. 277 కోట్లకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోతే.. గ్రామాల్లో ఘర్షణలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత బకాయిలా? కొత్త పనులా? లేక మెయింటెనెన్సా? అనే దానిపై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని సూచిస్తున్నారు.
పెండింగ్ బిల్లులు ఇవ్వాలి
పంచాయతీలకు విడుదలైన రూ.277 కోట్ల నిధులతో మాజీ సర్పంచుల పెండింగ్బిల్లులు చెల్లించాలి. దీంతో మాజీ సర్పంచులకు కొంత ఊరట కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచులకు దాదాపు రూ.531 కోట్లకుపైగా బకాయి ఉంది. వీటిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం.. అయినా స్పందించడం లేదు. 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో మాజీ సర్పంచులు అభివృద్ధి పనులు చేశారు. అప్పుడు తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. పలువురు మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
- యాదయ్య గౌడ్, మాజీ సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్
పాత బకాయిలు చెల్లించేందుకు ఒప్పుకోం..
ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన రూ.277 కోట్లు పంచాయతీలకు కేటాయించాలి. జనాభా ప్రతిపాదికన మా గ్రామానికి ఎంత వస్తే అన్ని నిధులు కేటాయించాలి. గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సర్పంచ్‌గా పోటీచేసి గెలిచాను. గ్రామానికి కావాల్సిన సదుపాయాలను ప్రణాళిక ప్రకారం కల్పించాలనుకుంటున్నాను. ఈ క్రమంలో మేం సర్పంచులుగా కొలువుదీరిన మొదటిసారిగా వచ్చిన నిధులను పంచాయతీ డెవలప్మెంట్కే వినియోగించాలి. కానీ వీటితో పాత బకాయిలు చెల్లిస్తామంటే ఒప్పుకోం. మాజీ సర్పంచుల బకాయిల కోసం ప్రభుత్వం వేరే నిధులు కేటాయించాలి.
- చల్లగురుగుల సుదర్శన్, సర్పంచ్, తిరుమలగిరి, భూపాలపల్లి జిల్లా
