అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం.. బిల్డింగ్ యజమాని కోసం గాలింపు

అగ్నిప్రమాదంపై దర్యాప్తు వేగవంతం..  బిల్డింగ్ యజమాని కోసం గాలింపు

హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికులు, బాధితుల వివరాలను తీసుకుని.. అన్ని కోణాల్లోనూ విచారణ మొదలుపెట్టారు. పరారీలో ఉన్న బిల్డింగ్ యజమాని కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అగ్నిప్రమాద ఘటనపై పోలీసులు  వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  304, 285, 286, ఐపీసీ 9 బీ(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరోవైపు... బాధిత కుటుంబాలను రాజకీయ పార్టీల నాయకులు పరామర్శిస్తున్నారు. అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ప్రమాదానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మార్నింగ్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీపీఐ నేత నారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. 

ఇంకోవైపు... ప్రమాదం జరిగిన స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. అధికారులతో కలిసి సందర్శించారు. ప్రమాదానికి అసలు కారణాలేంటో అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియా ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామని, అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తామని చెప్పారు. 

హైదరాబాద్ నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లోని హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లో  నవంబర్ 13వ తేదీ సోమవారం ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది.  గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చాయని చెబుతున్నారు. అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటం.. వాటికి క్షణాల్లో మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.  ఘటనాస్థలికి నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. 

నిర్లక్ష్యం ఖరీదు 

స్వప్నలోక్ ఘటన జరిగినప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు నానా హడావుడి చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వం కమిటీ వేసినా ఫలితం శూన్యంగా కనిపిస్తోంది. కమిటీ ఏర్పాటు తర్వాత 200 మందికి నోటీసులు ఇచ్చారు. తాజాగా ప్రమాదం జరిగిన భవనానికి G+2కు మాత్రమే పర్మిషన్ ఉంది. కానీ.. పరిమితికి మించి అంతస్తులు నిర్మించినట్లు తెలుస్తోంది. నాలుగు ఫ్లోర్లు, పెంట్ హౌస్ నిర్మించారు సెట్ బ్యాక్ వదలకుండా భవన నిర్మాణం చేపట్టారు యజమాని. 

ALSO READ :- రేవంత్ రెడ్డి అహంకారానికి హద్దుల్లేవు : సీఎం కేసీఆర్