మహారాష్ట్రలో నంబర్​గేమ్..

మహారాష్ట్రలో నంబర్​గేమ్..
  • ఏక్​నాథ్​ షిండే శిబిరంలో 42 మంది
  • 12 మంది​పై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్​కు శివసేన లేఖ
  • 24 గంటల్లో తిరిగి వస్తే ఎంవీఏ నుంచి బయటికొచ్చేందుకు రెడీ: సంజయ్​ రౌత్ 
  • ఎంవీఏకు మద్దతు కొనసాగిస్తామన్న  కాంగ్రెస్, ఎన్సీపీ  
  • మెజార్టీ ఎవరిదనేది అసెంబ్లీలోనే  తేలుతుంది: పవార్

ముంబై/గౌహతి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. రెబెల్​ ఎమ్మెల్యేల బలం రోజురోజుకూ పెరుగుతోంది. కేబినెట్​ మినిస్టర్​ ఏక్​నాథ్​ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య 42కు చేరింది. గురువారం మొత్తం 42 మంది ఎమ్మెల్యేల వీడియోను షిండే మీడియాకు విడుదల చేశారు. అయితే మహా వికాస్​ అఘాడీ(ఎంవీఏ)ని కాపాడేందుకు, సీఎం సీటును నిలుపుకునేందుకు ఉద్ధవ్​ థాక్రే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రెబెల్​ ఎమ్మెల్యేల్లో 12 మందిపై వేటు వేయాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​కు శివసేన లేఖ రాసింది. అధికార ఎంవీఏ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమని, కానీ రెబెల్​ ఎమ్మెల్యేలు 24 గంటల్లో గౌహతిని వీడి ముంబై చేరుకోవాలని శివసేన ఎంపీ సంజయ్​రౌత్ చెప్పారు. తిరిగి వస్తే వారి డిమాండ్లపై సీఎం ఉద్ధవ్​తో చర్చిద్దామన్నారు. అయితే ఎంవీఏ పూర్తి కాలం కొనసాగాలని తాము కోరుకుంటున్నామని, ఉద్ధవ్​కు తమ మద్దతు కొనసాగుతుందని ఎన్సీపీ, కాంగ్రెస్​ ప్రకటించాయి. నాలుగు రోజుల క్రితం ఏక్​నాథ్​ షిండే తిరుగుబాటు చేయడంతో ఎంవీఏ సర్కారులో అసమ్మతి రాజుకున్న సంగతి తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్​ల​ ఎంవీఏ కూటమి నుంచి శివసేన బయటకు రావాలని ఆయన డిమాండ్​ చేస్తున్నారు. 
తొలుత గుజరాత్​లోని సూరత్​లో క్యాంప్​ వేసిన రెబెల్​ లీడర్లు ఆ తర్వాత తమ మకాంను బీజేపీ పాలిత రాష్ట్రమే అయిన అస్సాంలోని గౌహతీకి మార్చారు. 

తలుపులు తెరిచే ఉన్నా యి
శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ థాక్రే దాదాపు పార్టీపై పట్టుకోల్పోయినట్టే కనిపిస్తోంది. రెబెల్​ ఎమ్మెల్యేల బలం పెరుగుతోంటే.. ఉద్ధవ్​కు సపోర్ట్​గా ఉన్న వారి సంఖ్య తగ్గిపోతోంది. గురువారం ఉద్ధవ్​ ఏర్పాటు చేసిన సమావేశానికి 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ముంబై నుంచి గౌహతీకి చేరుకున్నట్టు తెలిసింది. మరోవైపు ఎమ్మెల్యేలకు తోడు కొందరు శివసేన ఎంపీలు కూడా రెబెల్​ క్యాంపులోకి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. శివసేనకు లోక్​సభలో 19 మంది, రాజ్యసభలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరిలో పది మందికిపైగా రెబెల్​ క్యాంపులోకి చేరారని, కొందరు గౌహతీలో ఉన్నట్టు సమాచారం. అయితే రెబెల్​ ఎమ్మెల్యేలకు పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని, వారు లేవనెత్తిన అంశాన్నింటిని చర్చల ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని సంజయ్​ రౌత్ చెప్పారు. కాగా, రెబెల్​ క్యాంపును బుజ్జగిస్తూనే వారిని కట్టడి చేసేందుకు ఉద్ధవ్​ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా 12 మంది రెబెల్​ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్​కు శివసేన పిటిషన్​ ఇచ్చింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన గ్రూప్​ లీడర్​గా షిండే స్థానంలో అజయ్​ చౌదరి నియామకానికి డిప్యూటీ స్పీకర్​ నరహరి జిర్వాల్​ ఆమోదముద్ర వేశారు.

42కు చేరిన రెబెల్స్​ బలం
ప్రస్తుతం షిండే క్యాంపులో 37 మంది రెబెల్​ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో ఇద్దరు ఈ క్యాంపులో చేరడంతో వీరి బలం 39కి చేరింది. ఫిరాయింపుల నిరోధక చట్టానికి భంగం కలగకుండా పార్టీని చీల్చేందుకు కావాల్సిన బలం ఇప్పుడు షిండే క్యాంపునకు ఉన్నట్టే. ఇండిపెండెంట్లను కలుపుకుంటే వీరి బలం 42కు చేరింది. మరోవైపు సీఎం ఉద్ధవ్​ను కలిసేందుకు తమకు అవకాశమే దక్కడం లేదని, రెండున్నరేండ్లుగా సీఎం ఇంట్లోకి తమకు ఎంట్రీయే ఇవ్వలేదని రెబెల్​ ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్​ ట్విట్టర్​లో ఆరోపించారు. తాము ఉద్ధవ్​ రాజీనామా చేయాలని కోరుకుకోవడం లేదని, కాంగ్రెస్, ఎన్సీపీని వదిలి.. బీజేపీతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే చాలని రెబెల్​ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. శివసేన ఎమ్మెల్యేలను కిడ్నాప్​ చేశారంటూ ఆ పార్టీ నేతలు కామెంట్లు చేయడంతో రెబెల్​ ఎమ్మెల్యేలు కొన్ని ఫొటోలు రిలీజ్​ చేశారు. తమను ఎవరూ కిడ్నాప్​ చేయలేదని, అందరూ స్వచ్ఛందంగానే వచ్చారంటూ వారు విమానంలో ఉన్న ఫొటోలను షిండే క్యాంపు విడుదల చేసింది. 
మద్దతు కొనసాగిస్తాం: కాంగ్రెస్, ఎన్సీపీ..

మాకు సంబంధం లేదు: బీజేపీ
వరుస సమావేశాల తర్వాత ఉద్ధవ్​ థాక్రేకు తమ మద్దతు కొనసాగిస్తామని కాంగ్రెస్, ఎన్సీపీ ప్రకటించాయి. తాము కలిసే పోరాటం చేస్తామని, ఎంవీఏ కలిసే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్​ లీడర్​ మల్లికార్జున్​ ఖర్గే చెప్పారు. ఎంవీఏ సంక్షోభం నుంచి బయటపడుతుందని ఎన్సీపీ చీఫ్​ శరద్​ పవార్​ చెప్పారు. ఎవరి బలం ఎంతనేది అసెంబ్లీలో తేలుతుందన్నారు. సూరత్, గౌహతీలో కూర్చుని ఎవరు ఎన్నైనా చెప్పవచ్చని, ముంబై వస్తేనే అసలు పరిస్థితులు ఏమిటో తెలుస్తాయన్నారు. ఉద్ధవ్​కు తాము మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్ర సంక్షోభంతో తమకు సంబంధం లేదని, తాము ఆపరేషన్​ లోటస్​ చేపట్టామన్న వార్తలు అవాస్తవమని బీజేపీ ప్రకటించింది. అయితే అస్సాంలో శివసేన రెబెల్​ ఎమ్మెల్యేలతో బీజేపీ మినిస్టర్ ఒకరు ఉన్నట్టు వీడియోలో స్పష్టమైంది. అలాగే శివసేన ఎమ్మెల్యేలు అస్సాం రావడానికి ముందు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ హోటల్ లో కనిపించారు.

ఎన్సీపీ, కాంగ్రెస్​తో బంధం తెంచుకుంటేనే
తన బలాన్ని నిరూపించుకుంటూ షిండే ఒక వీడియో రిలీజ్​ చేశారు. హిందూత్వ సిద్ధాంతాలను కాంగ్రెస్, ఎన్సీపీ కాలరాస్తున్నాయని, గత రెండున్నర సంవత్సరాలుగా పార్టీ లీడర్లు ఎన్నో కష్టాలు అనుభవించారని ఆయన చెప్పారు. ఎన్సీపీ, కాంగ్రెస్​తో బంధం తెంచుకుంటేనే చర్చలు జరుపుతామని ప్రకటించారు. గ్రూప్​ లీడర్​గా తమ తరపున షిండే నిర్ణయం తీసుకుంటారని ఈ వీడియోలో రెబెల్​ ఎమ్మెల్యేలు ప్రకటించారు. 

12 మందిపై అనర్హత వేటు వేయండి
12 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​కు శివసేన పిటిషన్​ ఇచ్చింది. ఈ జాబితాలో రెబెల్​ లీడర్ ఏక్​నాథ్​షిండే పేరు కూడా ఉంది. ఈ లిస్ట్​లో ఏక్​నాథ్​షిండేతో పాటు సంజయ్ శిర్సాత్, సందీపన్​ భుమ్రే, తానాజీ సావంత్, భరత్​ గోగావాలె, అబ్దుల్ సత్తార్, లతా సోనావానే, యామినీ జాదవ్, ప్రకాశ్ సర్వే, అనిల్​ బాబర్, బాలాజీ కిన్నికర్, మహేశ్​ షిండే పేర్లు ఉన్నాయి. అయితే తమకు చట్టం తెలుసని, అనర్హత వేటు వేస్తామని భయపెడితే బెదిరేది లేదని ఏక్​నాథ్​ షిండే స్పష్టం చేశారు. తమ హక్కుల కోసమే తిరుగుబాటు చేశామని చెప్పారు.