కొడుకు కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి తండ్లాట

కొడుకు కోసం గుత్తా సుఖేందర్ రెడ్డి తండ్లాట

నల్గొండ, వెలుగు: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీకి బ్రేక్ పడింది. వచ్చే ఎన్నికల్లో కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆశించినప్పటికీ కేసీఆర్ అభ్యర్థిగా చాన్స్ ఇవ్వలేదు. వాస్తవానికి కేటీఆర్ సూచన మేరకే అమిత్ రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశించారు. కానీ, ఉమ్మడి జిల్లాలో 12 మంది సిట్టింగ్​లనే కేసీఆర్ మళ్లీ అభ్యర్థులుగా ప్రకటించారు. 

దీంతో ఇన్నాళ్లూ మునుగోడు, నల్గొండలో పలు కార్యక్రమాలు చేపట్టిన అమిత్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.  అమిత్​కు టికెట్ వస్తదని ఆయన వెంట నడిచిన నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని నేతలు కూడా ఇప్పుడు అయోమయంలో పడ్డారు. అమిత్ రెడ్డి.. తన తాత గుత్తా వెంకట రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో మునుగోడు, నల్గొండ సెగ్మెంట్లలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 
.
కేటీఆర్, అమిత్ మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని, కేటీఆర్ ఆహ్వానం మేరకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని అందువల్ల టికెట్ ఖాయమని గుత్తా కూడా అనేవారు. 2004లో తొలిసారిగా టీడీపీ తరఫున నల్గొండ ఎమ్మెల్యేగా సుఖేందర్​ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 3సార్లు ఎంపీగా గెలిచారు. బీఆర్​ఎస్​లో చేరాక మండలి చైర్మన్ పదవి వచ్చింది. తన కొడుక్కు ఎమ్మెల్యే చాన్స్ లభిస్తే తన కోరిక తీరుతుందని  అనుకున్నా నిరాశే మిగిలింది.