సంక్రాంతి ముగ్గులు- సంప్రదాయ చిహ్నాలు

సంక్రాంతి ముగ్గులు-  సంప్రదాయ చిహ్నాలు

ముగ్గులు ఏ  ప్రదేశాన్నైనా అందంగా లక్ష్మీ ప్రధానంగా మారుస్తాయి. రంగు రంగుల పూలు, మంచి  డిజైన్ లే కాకుండా..  ముగ్గుల  గురించి  ఎన్నో  తెలియని విషయాలు ఉన్నాయి. ప్రతిరోజు మనంచూసే ఒక సాధారణమైన ముగ్గు అర్ధం ఏమిటి?  కారణం ఏమిటి? ప్రభావం ఏమిటి? ఉద్దేశం ఏమిటి?  ఈ ప్రశ్నలకు  సమాధానాలు మనం  సంక్రాంతి  సందర్భంగా  తెలుసుకుందాం. 17 డిసెంబర్  2025 నుంచి 2026  జనవరి 13, 14, 15  దాకా ధనుర్మాసం ఉంటుంది.

ధనుర్మాసం చివరి  మూడురోజులే  సంక్రాంతి.  ఈ  రోజులలో  మన ఇండ్ల ముందర  రకరకాల  రంగుల్లో  ముగ్గులు,  గొబ్బెమ్మలు,  పూలు,  పసుపు  కుంకుమలతో,   మామిడి బంతిపూల  తోరణాలతో,  ఇంటిముందు  కనిపించే  దృశ్యాలు  చాలా  బాగుంటాయి.  ఎగిరే  గాలిపటాలతో ఆకాశం  నిండిపోయి పతంగులు  సూర్యదేవునితో   పోటీపడినట్లు ఉంటుంది.  హరిదాసులు, గంగిరెద్దులు విన్యాసాలు కనువిందు చేస్తాయి.  భోగి పండుగనాడు భోగిమంటలు,  పిల్లలకి  భోగిపండ్లు,  ఆడవాళ్లకి  పసుపు,  కుంకుమలు,  పువ్వులు,  గాజులు,  చలిమిడి,  కొత్త బట్టలు, పిండి వంటలు వండుకోవడం ఇవన్నీ ఆచారాలు.

హరిదాసుల కీర్తనలు

పద్మములు, శంఖాలు, చతురస్త్రాలు, చక్రాలు ( వృత్తాలు) మన పూర్వీకులు మనకు అందించిన  దేవతల గుర్తులు,  అలంకారాలు.  అవి శుభప్రదమైనవి.  ముగ్గుల రూపంలో  భూమాతకి  దైవ చిహ్నాలుగా  అందించగల శక్తి ఉన్న మహిళలకి  నీరాజనంతో  సుమాంజలి.  సంక్రాంతి  సమయంలో హరిదాసులు వస్తుంటారు.  హరి అంటే  శ్రీమహావిష్ణువు. - దాసు అంటే శిష్యుడు.  ఈ  అర్థవంతమైన  పేరులోనే  అన్ని  నిమిడీకృతమై ఉన్నవి.  హరిదాసు ఆశీర్వచనాలు  ఎంతో  ప్రాముఖ్యమైనవి.  హరిదాసు దుస్తులు,  అలంకారాలు వర్ణించడం చాలా ముఖ్యమైనది.  హరికి ముఖ్య శిష్యుడు అంటే  సాక్షాత్తు దైవిక శక్తే కదా!  ఈ కలియుగంలో మనకి ఇంతైనా అదృష్టం ఇచ్చిన ఆ దైవానికి అనంతకోటి నమస్కారములు.  ఆ  హరిప్రియుడు  చేతిలో  చిరతలు, కాలికి గజ్జెలు, సంప్రదాయ చిహ్నంగా బొట్టు,  పంచెకట్టు,  కండువాతో  మన ఇంటికి వచ్చే ఆ  హైందవ దైవిక శక్తికి సుమాంజలి.  హరిదాసులు ముగ్గుల లోగిళ్లలో  లయబద్ధంగా దేవదేవుడిని పాటలతో,   చిరు గజ్జెల సవ్వడితో  కీర్తిస్తూ  సందడిగా నాట్యం చేస్తారు.   లోగిళ్లకు  ప్రత్యేక  అందాలు తీసుకువచ్చే  ఆ దృశ్యం,  అనుభూతి వర్ణనాతీతం. 

లక్ష్మీదేవికి ఆహ్వానం

ఆడపిల్లలు  పట్టు పరికిణీలలో,  అందాల పూల జడలతో,  కాళ్లకు వెండి పట్టీలు, జడకు  బంగారు జడ కుప్పెలు,  నడుముకి వడ్డాణాలు,  చేతులకు కట్టే- వంకీలు,  బంగారు గాజులు, తలమీద  సూర్యచంద్రులూ పెట్టుకున్న చిన్న  శ్రీమహాలక్ష్మిలాగా  కనిపిస్తారు.   దోసిళ్లలో బియ్యం తీసుకుని  హరిదాసు  కలశంలో  పోస్తుంటారు. ఆ చిన్నారి చేతుల్లో ఉన్న  బియ్యాన్ని ముగ్గులలో ఉన్న  హరిదాసు  కొంచెం వంగి  కలశంలో పోయించుకుంటారు. ఆ ఇంటి యజమాని,   అతని  కుటుంబం అంతా  భోగభాగ్యాలతో,  అఖండ  సౌభాగ్యాలతో  చిరకాలం వర్ధిల్లాలని ఆశీర్వదిస్తాడు.   అనంతరం  ఆ  పక్కనే ఉన్న  ఇంకో  ముగ్గుల ముంగిటికీ  దేవుడి  శిష్యుడు  పయనిస్తాడు.   లోగిలిలో  కళకళలాడే   ముగ్గులు,  తోరణాలతో  అలరారుతున్న ఆ  ఇంట్లోని  మహిళలు  లక్ష్మీదేవికి ఆహ్వానం  పలకడం  ఎంతో  పవిత్రమైనది.  ఇంకొక ముఖ్యమైన విషయం ఈ పండుగలో  మన దేశ ప్రగతికి  తోడ్పడే  రైతుకి కూడా భాగం ఉంది.  ధాన్యలక్ష్మిని ఇంటికి తీసుకువచ్చే సమయం కూడా సంక్రాంతి.   అనేక  ఋతువుల  ఆటుపోట్లను  తట్టుకొని పొలంలో ఆ సమయాన్ని గడిపి ఇంటికి వచ్చే రైతు ధన్యుడు.  ఆ కొత్త ధాన్యంతో పరమాన్నం- చేస్తారు.  కొత్త బియ్యం, బెల్లం, పాలతో, చేసి ఆ ధాన్యలక్ష్మికి, భూమాతకు, అష్టదిక్పాలకులకు, వరుణ,  వాయుదేవుడికి  ధన్యవాదములుగా నైవేద్యం  సమర్పిస్తారు.   ఇదికాక పల్లెటూర్లలో పొలం నుంచి వచ్చిన ధాన్యం  ముందు రోజుల కోసం దాయటాన్ని ‘పాతర’ వేయటం అంటారు. ఇది ఇంట్లో భూమిలో లెక్క ప్రకారం తవ్వి ఎండు గడ్డిలో  ‘వెంట్లు’ తయారుచేసి దానిలోపల అమర్చటం, ఆ మధ్యలో వడ్లను ఇంటి ఆడపిల్లలతో ఐదు దోసిళ్లతో  వేయించి ఆ తరువాత వారికి ఐదు గంపల ధాన్యాన్ని బహుమతిగా ఇవ్వటం ఆనాదిగా వస్తున్న ఆచారం. 

- కోట ఉమాశర్మ, రచయిత్రి