కోట్ల విలువైన భూమి..రూ.40కే రిజిస్ట్రేషన్! భూ భారతి చలాన్ల దందాలో అక్రమాలు

కోట్ల విలువైన భూమి..రూ.40కే రిజిస్ట్రేషన్! భూ భారతి చలాన్ల దందాలో  అక్రమాలు
  • ఎడిట్‌‌ ఆప్షన్‌‌ దుర్వినియోగం.. యూట్యూబ్‌‌లో వీడియోలు చూసి చలాన్ల జనరేట్‌‌
  • పూర్తి వివరాలతో ఎన్‌‌ఐసీ రిపోర్ట్.. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోనే భారీగా అవినీతి
  • కొనసాగుతున్న కమిటీ విచారణ.. ఇప్పటికే ఆయా జిల్లాలకు అక్రమ చలాన్ల లిస్ట్  
  • మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లవారీగా వివరాల సేకరణ
  • అక్రమార్కులతో తహసీల్దార్లు కుమ్మక్కయ్యారనే అనుమానాలు
  • అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే భూ భారతి చట్టం ప్రకారం ఉద్యోగం ఊస్టే!

హైదరాబాద్/యాదాద్రి, వెలుగు:వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల అక్రమ చలాన్ల వ్యవహారంలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి.  ధరణి, భూభారతి పోర్టల్‌‌లలో ఉన్న సాంకేతిక లోపాన్ని ఆసరా చేసుకొన్న అక్రమార్కులు ప్రభుత్వానికి చేరాల్సిన రిజిస్ట్రేషన్​ ఫీజుల్లో 90 నుంచి 99శాతం వరకు సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు ఇప్పటికే తేలింది.  ఈ క్రమంలో సర్కారుకు కేవలం రూ.40, రూ.90 మాత్రమే  చెల్లించి కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్​పూర్తిచేయించుకున్నట్లు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ (ఎన్‌‌ఐసీ ) రూపొందించిన అక్రమ చలాన్ల నివేదికలో బయటపడింది. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లవారీగా వివరాల సేకరించి రూపొందించిన ఈ లిస్ట్‌‌.. ఇప్పటికే ఆయా జిల్లాలకు చేరింది. 

ఈ రెండు జిల్లాల్లోనే ఎక్కువ.. 

ప్రధానంగా రంగారెడ్డి, యదాద్రి భువనగిరి జిల్లాల్లోనే ఈతరహా మోసాలు ఎక్కువగా జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.  మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సొమ్మును పక్కదారి పట్టించారు. సిటిజన్ లాగిన్‌‌లో ఉండే టెక్నికల్‌‌ లోపాలను ఆసరాగా చేసుకొని, ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను  తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.  ధరణి వచ్చిన తర్వాత అటు స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్లు, ఇటు రెవెన్యూ.. ఈ రెండు శాఖలూ ఆడిటింగ్‌‌ను గాలికొదిలేశాయి. ఇదే అదనుగా కొంతమంది గ్రూప్‌‌లుగా ఏర్పడి ఈ వ్యవహారం నడిపారు. మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్లవారీగా ఎవరి ఐడీ నుంచి అక్రమాలు జరిగాయో వివరాలను తాజాగా ఎన్ఐసీ సేకరించి, జిల్లాలకు పంపించింది. ఆ సమయంలో ఎవరెవరు తహసీల్దార్లు ఉన్నారు ? వారి పాత్ర ఏంటి? అనేదానిపైనా హై లెవల్​కమిటీ విచారణ జరుపుతున్నది. 

ఎడిట్​ ఆప్షన్​ దుర్వినియోగం.. 

భూముల రిజిస్ట్రేషన్ కోసం రైతులు, సామాన్య ప్రజలు మీసేవా కేంద్రాలను లేదా ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. సిటిజన్ లాగిన్‌‌లో స్లాట్ బుక్ చేసే సమయంలోనే రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడే టెక్నికల్ లొసుగులను పసిగట్టిన కొందరు అక్రమార్కులు తమ చేతివాటం ప్రదర్శించారు. రైతుల నుంచి రిజిస్ట్రేషన్‌‌కు కావాల్సిన పూర్తి డబ్బులను వసూలు చేస్తున్నారు. కానీ, పోర్టల్‌‌లో పేమెంట్ గేట్‌‌వేలో ‘ఎడిట్’ ఆప్షన్‌‌ను దుర్వినియోగం చేసి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని భారీగా తగ్గించి చూపించారు. ఉదాహరణకు లక్షా 40 వేల రూపాయలు కట్టాల్సి ఉంటే, కేవలం రూ. 40 కట్టి చలాన్ జనరేట్ చేశారు. యూట్యూబ్‌‌లో వీడియోల ద్వారా ఈ టెక్నిక్‌‌  తెలుసుకున్నట్లు సమాచారం. ఇలా.. గ్రూపులుగా ఏర్పడిన ఈ ముఠాలు ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని  దోచుకున్నాయి.

యాదాద్రి జిల్లాలో 1,367 డాక్యుమెంట్లలో మోసం.. 

యాదాద్రి జిల్లాలో చీటింగ్ జరిగినట్లు భావిస్తున్న 1,367 డాక్యుమెంట్లను కలెక్టర్‌‌‌‌కు ఎన్‌‌ఐసీ పంపించగా, వీటిని రెవెన్యూ అధికారులు పరిశీలించినప్పుడు ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూశాయి. కొన్ని డాక్యుమెంట్లను రూ. 1, రూ. 40, రూ. 90 .. ఇలా అతి తక్కువ రేట్లకే రిజిస్ట్రేషన్​ చేసినట్లు  తేలింది. ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్​ జరిగినట్లు భావిస్తున్న ఐదు డాక్యుమెంట్లలో ఒక డాక్యుమెంట్‌‌కు మరుసటి రోజు మిగిలిన అమౌంట్​ చెల్లించగా, మిగిలిన నాలుగు డాక్యుమెంట్లను వెరిఫై చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. మిగిలిన డాక్యుమెంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ఫీజుల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే సర్కారు ఖజానాకు చేర్చి, మిగిలిన 99 శాతం అమౌంట్‌‌ను తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 1,367 రిజిస్ట్రేషన్లకుగానూ రూ. 5,49,81,004 ప్రభుత్వ ఖజానాలో జమ కావల్సి ఉండగా, కేవలం రూ. 57,34,123 మాత్రమే యాడ్‌‌ అయినట్టు ఎన్ఐసీ నివేదిక స్పష్టం చేసింది. అంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలను ఈ ముఠాలు స్వాహా చేశాయి.  కాగా,  ఈ మోసానికి సంబంధించి యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, అడ్డగూడూరు మినహా మిగిలిన 15 మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో తహసీల్దార్లు చేసిన ఫిర్యాదు మేరకు 70 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో నెట్ సెంటర్లు, మీ సేవా నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు.  అక్రమాలకు పాల్పడిన సెంటర్ల ఐడీలను బ్లాక్ చేయడమే కాకుండా, వారి నుంచి వసూలు చేసిన సొమ్మును కట్టించే పనిలో పడ్డారు.

ఒక్కడే కోటి మళ్లించుకున్నడు.. 

ఈ కుంభకోణంలో ఒక్కో నిర్వాహకుడు చేసిన మోసం కోట్లలో ఉండటం గమనార్హం. చౌటుప్పల్‌‌లో తరుణ్ అనే ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు 240 స్లాట్ బుకింగ్స్ చేయగా, రూ. 1.20 కోట్లు పేమెంట్ చేయాల్సి ఉంది. కానీ అతను ఎడిట్ ఆప్షన్ వాడి కేవలం రూ. 1.90 లక్షలు మాత్రమే ప్రభుత్వానికి కట్టి, మిగిలిన కోటి రూపాయలకు పైగా సొంత ఖాతాలో వేసుకున్నాడు. విషయం బయటకు రాగానే షాపుకు తాళం వేసి పారిపోయాడు. రాజాపేట మండలంలో జెల్ల పాండు అనే వ్యక్తి 344 డాక్యుమెంట్లకు రూ. 72 లక్షలు కట్టాల్సి ఉండగా, కేవలం రూ. 4.20 లక్షలే కట్టాడు. దాదాపు రూ. 65 లక్షలు మింగేశాడు. ఇతను ప్రస్తుతం వరంగల్ పోలీసుల అదుపులో ఉన్నాడు. యాదగిరిగుట్టలో బస్వరాజు అనే వ్యక్తి రూ. 84 లక్షలకుగానూ కేవలం రూ. 5 లక్షలే కట్టి ప్రభుత్వానికి టోకరా వేశాడు. ఇకపై ఆధార్ నెంబర్‌‌‌‌తో పాసు పుస్తకం ఉన్నవాళ్లే స్లాట్ బుక్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 

రంగంలోకి  హైలెవల్​ కమిటీ 

ఈ భారీ స్కామ్​పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఐపీఎస్ అధికారి సింధు, సీసీఎల్ఏ సెక్రటరీ మక రంద్, చార్టెడ్ అకౌంటెంట్ శరద్, ఎన్​ఐసీ ప్రతినిధి శ్రీనివాస్, డీఎస్పీ సంపత్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ సుభాషిణి ఉన్నారు. ఈ కమిటీ ప్రస్తుతం అన్ని లావాదేవీలను క్షుణ్నంగా మానిటర్ చేస్తున్నది. అక్ర మాలు ఎన్ని రకాలుగా జరిగాయి? దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవ రు? ఎంత కాలం నుంచి ఈ దందా సాగుతున్నది? ప్రభుత్వానికి జరిగిన నష్టం ఎంత? అనే కోణాల్లో విచార ణ సాగుతున్నది. రికవరీకి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై కూడా కమిటీ దృష్టి సారించింది. భూ భారతి సాఫ్ట్‌‌వేర్‌‌‌‌లో ఉన్న లోపాలను గుర్తించి, వాటిని ఎలా సరిదిద్దాలనే దానిపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ప్రాథమిక సమాచారం ప్రకారం రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోనే అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు నిర్ధారించారు.

తహసీల్దార్లు విఫలం.. 

రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యత కలిగిన తహసీల్దార్లు (జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు) కూడా చలాన్లను క్షుణ్నంగా పరిశీలించడంలో  విఫలమయ్యారు. వాస్తవానికి సిస్టమ్‌‌లో జనరేట్ అయిన చలాన్ నంబర్, అందులో ఉన్న మొత్తం, ప్రభుత్వ ఖాతాలో జమ అయిన మొత్తం సరిపోలుతుందా? లేదా? అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పని జరగలేదు. అయితే, కేవలం నిర్లక్ష్యమేనా? లేక గ్రూప్​గా ఏర్పడిన వ్యక్తులతో తహసీల్దార్లు కూడా కుమ్మక్కై ఈ వ్యవహారానికి సహకరించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలోనే అధికారులు విచారణ చేస్తున్నారు. అక్రమ చలాన్లు జనరేట్​ చేసిన సమయంలో విధుల్లో ఉన్న తహసీల్దార్లు ఎవరు? వారి ఐడీల నుంచి అప్రూవల్ ఎలా లభించింది? అనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అధికారుల పాత్ర ఉన్నట్లు నిరూపితమైతే భూ భారతి చట్టం ప్రకారం వారి ఉద్యోగాలు ఊడటం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

ఎన్ఐసీ పంపిన లిస్ట్​ ప్రకారం

మండలాలవారీగా రిజిస్ట్రేషన్ల వివరాలు
మండలం    డాక్యుమెంట్లు    చెల్లించాల్సిన అమౌంట్​    చెల్లించిన అమౌంట్​

చౌటుప్పల్​    240    1,20,05,673    1,90,278
అడ్డగూడూరు    03    1,81,136    53,965
ఆలేరు    09    9,37,040    3.62,186
ఆత్మకూరు(ఎం)    43    13,72,958    5,15,509
భువనగిరి    53    56,12,151    13,01,861
బీబీనగర్​    61    39,14,462    9,92,830
బొమ్మల రామారం    38    28,73,304    1,05,785
బీ పోచంపల్లి    18    18,19,914    1,37,404
గుండాల    31    5,59,936    1,15,347
తుర్కపల్లి    101    30,80,842    3,11,741
మోటకొండూరు    72    22,82,787    2,00,274
మోత్కూరు    07    6,15,757    2,27,460
నారాయణపూర్​    36    10,66,115    90,694
రాజాపేట    344    72,31,827    4,20,098
రామన్నపేట    12    5,22,992    1,12,759
వలిగొండ    65    24,74,928    83,897
యాదగిరిగుట్ట    234    84,19,182    5,12,035