సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

సీఎం పర్యటనను సక్సెస్ చేయాలి : కలెక్టర్ అభిలాష అభినవ్
  • సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేయాలి
  • అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ దిశానిర్దేశం
  • పర్యటన, సభ ఏర్పాట్ల పరిశీలన

నిర్మల్/లక్ష్మణచాంద(మామడ), వెలుగు:  నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ లో ఈ నెల 16న జరిగే సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్న నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. సదర్మాట్ బ్యారేజీ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

బ్యారేజీ ప్రాంగణాన్ని పరిశీలించి, కీలక సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుంచి బ్యారేజి వరకు సరైన రోడ్డు సౌకర్యం ఉండాలన్నారు. అధికారులు, వీఐపీలకు అనువైన పార్కింగ్​ను ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు, పార్కింగ్, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా తదితర వసతులు కల్పించాలని సూచించారు. అత్యవసర వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

సదర్మాట్ బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భద్రత ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు చేశారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి, వారికి కేటాయించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహించి సీఎం పర్యటన సక్సెస్ చేయాలని సూచించారు. 

సమస్యలు తలెత్తకుండా చూడాలి

నిర్మల్​లోని ఎన్టీఆర్ మినీ స్ట్రీడియంలో జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఎస్పీ జానకీ షర్మిల, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జ్ శ్రీహరిరావుతో కలిసి కలెక్టర్ అభిలాష పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. 

ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్, అడిషనల్ ఎస్పీ సాయికిరణ్, ఆర్డీవో రత్నకల్యాణి, నీటిపారుదల శాఖ అధికారి అనిల్, డీపీవో శ్రీనివాస్, జిల్లా ఎక్సైజ్ అధికారి ఎంఏ రజాక్, అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుశీల్ రెడ్డి, వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.