నిరసనలు.. బహిష్కరణలు

నిరసనలు.. బహిష్కరణలు
  • నిరసనలు.. బహిష్కరణలు
  • రోడ్డు వేయలేదని బహిష్కరించిన నల్లబాండబోడు గ్రామస్తులు
  • ఆఫీసర్ల హామీతో ఓటింగ్ స్టార్ట్
  • ఓట్లు బైకాట్ చేసిన గొల్లఘాట్ 
  • 13 సెగ్మెంట్లలో ముగిసిన పోలింగ్
  • పార్టీలు పైసలియ్యలేదని ఆందోళన
  • 106 సెగ్మెంట్లలో తుది దశకు పోలింగ్ 

హైదరాబాద్/ జూలూరుపాడు/ఆదిలాబాద్/కాసిపేట : పొలింగ్ ప్రక్రియ తుదిదశకు చేరింది. ఆందోళనలు, నిరసనలు, బహిష్కరణలతో ప్రక్రియ సాగుతోంది. ఇదిలా ఉండగా మావోయిస్టు  ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసింది.  ర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లోని  3341 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.  భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని నల్లబాండ బోడులో స్థానికులు నిరసనకు దిగారు. తమ గ్రామానికి రోడ్డు వేయలేదని ఆందోళన వ్యక్తంచేశారు. 

ఓట్లు వేయబోమని 2 గంటల పాటు భీష్మించారు. ఉన్నతాధికారులు గ్రామస్తులతో మాట్లాడి కృషి చేస్తానని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో సుమారు 149 మంది ఓటు వేసేందుకు కదిలారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గిరిజన గ్రామమైన గొల్లఘాట్ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. పాలకులు కొన్నేండ్లుగా మౌలిక సదుపాయాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో 270 మంది ఓటర్లు ఉన్నామని, ఈసారి ఓటును వినియోగించుకోమని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వరిపేట గ్రామస్తులు ఓటును బహిష్కరించారు. కొత్త వరిపేట, వరిపేట గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయకపోవడంపై నిరసన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న అభ్యర్థులు దుర్గం చిన్నయ్య, గడ్డం వినోద్, తహశీల్దార్ బోజన్న  ఓటర్లతో మాట్లాడి నచ్చజెప్పారు. దీంతో ఆరు గంటలు ఆలస్యంగా అక్కడ పోలింగ్ ప్రారంభమైంది.  

సూర్యాపేట/భద్రాద్రి కొత్తగూడెం : పోలింగ్ నేపథ్యంలో సూర్యాపేట- జమ్మిగడ్డలో కొందరు ఓటర్లు ఆందోళన చేపట్టారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, డబ్బులు ఇవ్వడం లేదని నిరసనకు దిగారు. పక్క వీధుల్లో ఓటర్ల కోసం డబ్బులు ఇస్తుంటే తమ వీధుల్లో పార్టీల నాయకులు మనీ పంచడం లేదని వాపోయారు. ‘మా ఓట్లు పార్టీలకు అవసరం లేదా?’ అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొందరు మహిళలు ముట్టడించారు. కొందరికి డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదంటూ పట్టణంలోని పలు వార్డులకు చెందిన మహిళలు ధర్నాకు దిగారు. వార్డు కౌన్సిలర్లు తమకు డబ్బు ఇవ్వలేదంటూ నిరసన చేపట్టారు.