ఊర్లల్లో పథకాల పంచాది .. బిల్డింగులున్నోళ్లకు, బీఆర్‍ఎస్‍ లీడర్లకు గృహలక్ష్మి

ఊర్లల్లో పథకాల పంచాది .. బిల్డింగులున్నోళ్లకు, బీఆర్‍ఎస్‍ లీడర్లకు గృహలక్ష్మి
  • ఊర్లల్లో పథకాల పంచాది 
  • బిల్డింగులున్నోళ్లకు, బీఆర్‍ఎస్‍ లీడర్లకు గృహలక్ష్మి
  • ఉన్నోళ్లకే దళితబంధు, బీసీ ఆర్థిక సాయం 
  • గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్​

వరంగల్‍, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా అమలు చేస్తున్న స్కీముల్లో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగడం లేదని పేదలు ఆరోపిస్తున్నారు. గృహలక్ష్మి, దళితబంధు, బీసీ సాయం తదితర స్కీము​లను అనర్హులకు, అధికార పార్టీ వాళ్లకే కట్టబెడుతున్నారని ఫైర్‍ అవుతున్నారు. కొద్దిరోజులుగా అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఆందోళనలు పెరుగుతున్నాయి. స్కీములను ఎమ్మెల్యేలు తమ అనుచరులకే కట్టబెడుతున్నారని ఆరోపిస్తూ ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. ఎంపికైన అనర్హుల ఇండ్లవద్దకే వెళ్లి అవకతవకలను ఎత్తి చూపుతు న్నారు. బీఆర్ఎస్ ​లీడర్లతో కాకుండా గతంలో మాదిరి గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని పబ్లిక్​డిమాండ్​ చేస్తున్నారు.  

ఎమ్మెల్యే చెప్పినోళ్లకే గృహలక్ష్మి  

గ్రామాల్లో అత్యంత పేదలకు లబ్ధిచేకూర్చే గృహలక్ష్మి పథకానికి అధికారులు ఎమ్మెల్యే చెప్పిన వారినే ఎంపిక చేస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేయగలిగేవారికి  దళితబంధు, గృహలక్ష్మి, బీసీ లోన్లకు ఎంపిక చేస్తున్నారు. బిల్డింగులు ఉన్నోళ్లు, సర్పంచులు, కార్పొరేటర్ల పేర్లు, వారి బంధువుల పేర్లు లబ్ధిదారుల లిస్ట్​లో ఉండటంతో  విమర్శలొస్తున్నాయి. దీనికితోడు లోకల్ ​లీడర్లు గృహలక్ష్మి మంజూరైన వారి వద్దకు వెళ్లి వారిని ఎమ్మెల్యే ఎంపిక చేశారని చెప్పుకుంటూ స్వయంగా ముగ్గు పోస్తున్నారు. దీంతో పేదలు మరింత రగిలిపోతున్నారు.    

 సంగారెడ్డి జిల్లాలో భారీగా అక్రమాలు

సంగారెడ్డి జిల్లాలో ఇటీవల గృహలక్ష్మి పథకం​ లబ్ధిదారుల లిస్టులు బయటకు రాగా, సంగా రెడ్డి, పటాన్​చెరు, ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో అవకతవకలు వెలుగుచూస్తున్నాయి. ఇండ్లు లేని నిరుపేదలను కాదని, పెద్ద పెద్ద భవంతులు, డూప్లెక్స్ ఇండ్లు ఉన్నవారిని ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కొండాపూర్ మండలం హరిదాస్​పూర్​లో ఊరూరు తిరిగి బా గోతం ఆడే కుటుంబాలు 15 నుంచి 20 దాకా ఉన్నాయి. వర్షం వస్తే కూలిపోయే స్థితిలో ఇండ్లు ఉండటంతో వాళ్లు.. గృహలక్ష్మి స్కీమ్​ కోసం అప్లై చేసుకున్నారు. వీరిలో ఏ ఒక్కరినీ ఎంపిక చేయని ఆఫీసర్లు ఆ ఊరి సర్పంచ్ బంధువుల్లో మూడు కుటుంబాలను గృహలక్ష్మికి ఎంపిక చేశారు. వీరిలో అందరికీ పక్కా ఇండ్లు ఉండటం గమనార్హం. ఇక ఇదే మండలంలోని తమ్మలిబాయ్ తండాలో సర్పంచ్ పేరును గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. ఆమెకు రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నదని, అయినా ఆమెను పథకంలో ఎందుకు ఎంపిక చేశారని ఆ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ గ్రామం నుంచి 14 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, అందులో సర్పంచ్ సహా 8 మంది ఆమె కుటుంబ సభ్యులు ఉండటం విమర్శలకు తావిస్తోంది.  

సీఎం దత్తత గ్రామంలో మూడంతస్తులున్నోళ్లకు

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లి మండలం కేశవరంలో మహిళలు సోమవారం ఆందోళన చేశారు.  మంత్రి మల్లారెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ నాయకులకే గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేశారని మండిపడ్డారు. కేశవరం ఉప సర్పంచ్​ ప్రమోద్‌‌కు మూడంతస్తుల ఇల్లు ఉండగా తల్లి మణెమ్మ పేరు మీద గృహలక్ష్మి స్కీమ్​కు అప్లయ్ చేసుకొని ప్రొసీడింగ్స్​తీసుకున్నారని మహిళలు ఆరోపించారు.  సర్పంచ్ పేరు జ్యోతి ఇంట్లో బీహార్‌‌‌‌కు చెందిన కుటుంబం 2 నెలలుగా రెంట్​కు ఉంటోందని, దీంతో వాళ్ల పేరు మీద గృహలక్ష్మి స్కీమ్ శాంక్షన్​ చేసుకున్నారని బాధిత మహిళలు ఆరోపించారు.  

  దళితబంధు స్కీమ్​ను కేవలం రూలింగ్ ​పార్టీ లీడర్లకే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 3న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాలలో దళిత కుటుంబాలు వాటర్​ ట్యాంక్​ ఎక్కి ఆందోళన నిర్వహించాయి. గ్రామంలో 150 కుటుంబాలు ఉంటే15 యూనిట్లు ఇచ్చారని, వారంతా బీఆర్ఎస్​ లీడర్లు, ఆర్థికంగా ఉన్నవాళ్లేనని ఆరోపించారు. 

 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో  ఇటీవల మహిళలు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. సొంత ఇండ్లు, 5,10 ఎకరాల కుపైన భూములు ఉన్నోళ్లకు, ఇటీవలే కొత్త ఇండ్లు కట్టుకున్న వాళ్లను కూడా గృహలక్ష్మి స్కీమ్​కు ఎంపిక చేశారన్నారు. ఎమ్మెల్యే లిస్టును పక్కన పెట్టి గ్రామసభ ద్వారా అర్హులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. 

సీక్రెట్​గా చెక్కుల పంపిణీ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో బీసీ, మైనార్టీ సాయం చెక్కులను కొందరు ఎమ్మెల్యేలు సీక్రెట్​గా లబ్ధిదారులకు పంచుతున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ లాంటి చెక్కుల పంపిణీని ఎంతో ఆర్భాటంగా నిర్వహించే ఎమ్మెల్యేలు ఈ చెక్కులను రహస్యంగా లబ్ధిదారులకు చేరవేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

గ్రామసభల్లో అర్హులను ఎంపిక చేయాలని ధర్నాలు

 వరంగల్‍ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో సోమవారం పేదలు  ధర్నాకు దిగారు. దళితబంధు, గృహలక్ష్మి   లబ్ధిదారుల ఎంపిక  పారదర్శకంగా జరగలేదని ఆరోపిస్తూ మర్రిపల్లి  ప్రజలు తహసీల్దార్‍ ఆఫీస్‍ వద్ద బైఠాయించారు. గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్​ చేస్తూ  ఆర్‍డీఓకు   వినతిపత్రం ఇచ్చారు. మహబూబాబాద్‍ జిల్లా ముడుపుగళ్లు గ్రామంలోనూ  పలువురు మంగళవారం వాటర్ ట్యాంక్‍ ఎక్కి నిరసన చేపట్టారు. పథకాల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై  రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఎక్కడో ఒకచోట  ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతూనే ఉన్నాయి.   

బీఆర్‍ఎస్‍ వాళ్లకే ఇచ్చుకుంటున్రు

నా భర్త చనిపోయిండు. పాత రేకుల ఇంట్లో పిల్లలతో ఉంటున్నం. గృహలక్ష్మి స్కీమ్​ ఇస్తే  ఇల్లు కట్టుకోవాలనుకున్న.  దరఖాస్తు చేసుకున్నా నాకు రాలేదు.  బీఆర్‍ఎస్‍ లీడర్ల చుట్టాలు.. లేదంటే వారు చెప్పినోళ్లకే ఇస్తున్రు.  

‑ ఎం.శైలజ, నారక్కపేట, వరంగల్‍