
కొత్త వివాదానికి తెరలేపిన జస్టిస్ ధర్మాధికారి కమిటి
మరో 584 మంది తెలంగాణలో చేరుస్తూ ఉత్తర్వులు
సుప్రీంకోర్టులో సవాలు చేసిన డిస్కంలు, నేడు విచారణ
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆరేళ్లయినా ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విభజన ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఐదేళ్లకుపైగా ఏపీ స్థానికత ఉన్న విద్యుత్ ఉద్యోగుల వివాదం కొనసాగుతోంది. సమస్యను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ధర్మాధికారి కమిటీ మరో కొత్త వివాదానికి తెరలేపింది. దీన్ని సవాలు చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.
ఇదీ వివాదం..
తెలంగాణ విద్యుత్ సంస్థలు 2015 జూన్ 10న ఏపీ స్థానికత ఉన్న 1,274 మంది విద్యుత్ ఉద్యోగులను రిలీవ్ చేశాయి. కానీ ఏపీ ప్రభుత్వం వారిని తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో రిలీవ్ అయిన ఉద్యోగుల్లో 1,157 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఫలితంగా రెండు రాష్ట్రా ల విద్యుత్ సంస్థల మధ్య వివాదం మొదలైంది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఏపీ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు జస్టిస్ ధర్మాధికారితో సింగిల్ మెంబర్ కమిటీని వేసింది. రెండు రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ఉద్యోగ సంఘాలతో పలుమార్లు సమావేశమైన కమిటీ, తుది నివేదిక ఇచ్చింది. దీనిప్రకారం ఏపీకి 655 మందిని, తెలంగాణకు 502 మందిని కేటాయించింది. ఆప్షన్ ఇవ్వని మరో 71 మందిని కూడా తెలంగాణకు కేటాయించింది. ధర్మాధికారి కమిటీ రిపోర్ట్ను వ్యతిరేకిస్తూ ఏపీ విద్యుత్‌సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. సవరణలు చేయాలని కమిటీకి సూచించింది. దీంతో ధర్మాధికారి కమిటీ మరో 584 మంది ఏపీ స్థానికత కలిగిన వారిని తెలంగాణకు కేటాయిస్తూ రిపోర్ట్ ఇచ్చారు. ఇది గైడ్ లైన్స్ కు విరుద్ధమని తెలంగాణ విద్యుత్ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కమిటీ మార్గదర్శకాల పేరా-5లో తెలంగాణ ఆప్షన్ ఇవ్వాలనుకునే వారు తెలంగాణ జిల్లాలకు సంబంధించిన వారై ఉండాలని, స్పౌస్ లు ఉన్నవారు ఆఫ్షన్ ఇవ్వొచ్చని పిటిషన్ లో పేర్కొన్నారు.
వేల కోట్లు వృథా..
హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీ స్థానికత కలిగిన 1,157 మంది ఉద్యోగులకు నెలకు రూ.18కోట్లకు పైగా వేతనాలిచ్చాయి. ఇలా వేతనాల రూపంలో వెయ్యికోట్లు, కోర్టుల చుట్టూ తిరగడానికి , లాయర్ల ఫీజులకు, ధర్మాధికారి కమిటీకి వేల కోట్లు వృథా అయ్యాయి. ఇదంతా తెలంగాణకే నష్టం చేకూర్చే అంశం కావడంతో ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ప్రభుత్వాల అలసత్వం వల్లే విద్యుత్ ఉద్యోగుల విషయం వివాదంగా మారిందని, స్పందించాల్సినప్పుడు స్పందించి ఉంటే అసలు వివాదమే ఉత్పన్నమయ్యేది కాదంటూ హైకోర్టు గతంలో అభిప్రాయపడింది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి ఉంటే త్వరగా పరిష్కారం అయ్యేదని పేర్కొంది.