82 రోజులు...1000 కి.మీలు...34 అసెంబ్లీ నియోజకవర్గాలు

82 రోజులు...1000 కి.మీలు...34 అసెంబ్లీ నియోజకవర్గాలు

టీఆర్ఎస్ కుటుంబ అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడాలనే లక్ష్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. అందుకు చిహ్నంగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లెవద్ద స్టేజీ వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన ‘పైలాన్‘ను బండి సంజయ్ ఆవిష్కరించారు. ప్రజా సంగ్రామ పాదయాత్ర వెయ్యి కి.మీల మార్క్ దాటడంతో స్థానిక నేతలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. వెయ్యి బెలూన్లు ఎగరేయడంతోపాటు వెయ్యి షాట్స్ (బాణాసంచా) కాల్చారు. దీంతోపాటు డప్పు వాయిద్యాలతో, కార్యకర్తల నృత్యాలతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు.
 
మొదటి విడత పాదయాత్ర ఆగస్టు 28న పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమై అక్టోబర్ 2న హుస్నాబాద్ లో ముగిసింది. తొలివిడతలో మొత్తం 36 రోజులపాటు పాదయాత్ర చేసి 438 కి.మీలు నడిచారు. 19 అసెంబ్లీలో 9 జిల్లాలు, 6 ఎంపీ సెగ్మెంట్లలో పాదయాత్ర చేశారు.

రెండో విడత పాదయాత్రను బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభించి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో  మే 14న ముగించారు. మొత్తం 31 రోజులపాటు పాదయాత్ర చేసిన సంజయ్ 3 ఎంపీ, 9 అసెంబ్లీ, 5 జిల్లాల మీదుగా 383 కి.మీలు నడిచారు. 

తాజాగా కొనసాగుతున్న మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న ప్రారంభమై ఇవాళ్టికి15 రోజులు. రేపటికి పాలకుర్తి నియోజకవర్గంలోని వెయ్యి కి.మీల మైలు రాయిని దాటి 1001 కి.మీలోకి అడుగు పెట్టనున్నారు. 

ఈ 82 రోజుల పాదయాత్రలో అనేక సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. వివిధ సమస్యలపై వేలాది దరఖాస్తులను స్వీకరించారు. వాటి పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు.