వ్యాయామ విద్యను గత సర్కార్ పట్టించుకోలే

వ్యాయామ విద్యను గత సర్కార్ పట్టించుకోలే
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలహామీని అమలు చేయాలి
  • పీఈటీ ,పీడీ పోస్టుల ఖాళీల భర్తీ చేపట్టాలి
  • తెలంగాణ అన్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్  

ముషీరాబాద్, వెలుగు: తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ అసమర్ధ పాలనలో వ్యాయామ విద్య పూర్తిగా నిర్లక్ష్యమైందని తెలంగాణ అన్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఆరోపించింది. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలను కూడా దూరం చేసిందని విమర్శించింది. రాష్ట్రంలో 4,671 ఉన్నత పాఠశాలలు ఉండగా, వాటిలో1,676 స్కూళ్లలోనే పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్  చేసి అనుబంధ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని కోరింది. అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపట్టారు.

కాంగ్రెస్  సీనియర్ నేత కోదండ రెడ్డి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్, అసోసియేషన్ అధ్యక్షుడు మందగోని సైదులు గౌడ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రం ఏర్పాటు కాగానే క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించి ప్రతి పాఠశాలకు పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను శాంక్షన్  చేసి భర్తీ చేస్తామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం అవి చేయకుండా నిరుద్యోగులపై నియతృత్వంతో వ్యవహరించారని మండిపడ్డారు. చదువుతో కుస్తీ పడుతుండగా.. విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన విధంగా పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కూడా నింపాలని కోరారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేశ్ కుమార్, మీసాల రాజు పాల్గొన్నారు.