చిన్న సినిమాలకు పెద్ద గుర్తింపు: FNCC అవార్డ్స్‌లో ‘కోర్ట్’ విజయం.. ‘రాజు వెడ్స్ రాంబాయి’కి హ్యాట్రిక్ అవార్డ్స్!

చిన్న సినిమాలకు పెద్ద గుర్తింపు: FNCC అవార్డ్స్‌లో ‘కోర్ట్’ విజయం.. ‘రాజు వెడ్స్ రాంబాయి’కి హ్యాట్రిక్ అవార్డ్స్!

ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (FNCC) సినీ పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. 2025 సంవత్సరానికి గానూ ఉత్తమ చిత్రంగా నాని నిర్మించిన "కోర్ట్‌" సినిమాకు అవార్డు దక్కగా, బెస్ట్ డైరెక్టర్ (సాయిలు కంపాటి), బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్ విభాగాల్లో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డిసెంబర్ 31న విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. 

విజేతలు.. ‘కోర్ట్‌’ చిత్ర దర్శక–నిర్మాతలు రామ్‌ జగదీశ్‌, దీప్తి గంటా, అలాగే ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ నిర్మాతలు వేణు ఊడుగుల, రాహుల్‌ మోపిదేవి, దర్శకుడు సాయిలు కంపాటి, హీరో అఖిల్‌రాజ్‌లకు అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, ఎఫ్‌.ఎన్‌.సి.సి అధ్యక్షుడు కె.ఎస్‌. రామారావు పురస్కారాలు అందజేశారు. జ్ఞాపికతో పాటు రూ.25 వేల నగదు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలుగా 50 ఏళ్ల అద్భుత ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకున్న అల్లు అరవింద్‌, అశ్వనీదత్‌, కాజా సూర్యనారాయణలను ఎఫ్‌.ఎన్‌.సి.సి కమిటీ సన్మానించింది.

వి.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆధ్వర్యంలో టెలివిజన్‌ పురస్కారాల ప్రదానం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు కె.ఎల్‌. నారాయణ, అశోక్‌ కుమార్‌ తదితర సినీ ప్రముఖులు పాల్గొని విజేతలను సన్మానించి అభినందించారు. అయితే, ఈ ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ అవార్డులు చిన్న సినిమాల్ని, కొత్త ప్రతిభని ప్రోత్సహించడమే లక్ష్యంగా అందిస్తుండటం విశేషం.

ఈ విషయాన్ని శుక్రవారం (2026 జనవరి 2న) దర్శక నిర్మాత వేణు ఉడుగుల X వేదికగా పంచుకున్నారు. ‘‘మేము ETV విన్‌తో కలిసి నిర్మించిన 'రాజు వెడ్స్ రంబాయి' చిత్రానికి FNCC 2025లో ఉత్తమ నిర్మాత, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు మరియు ఉత్తమ నటి అవార్డులు లభించాయి. ఈ గుర్తింపునకు మరియు దీని వెనుక ఉన్న సామూహిక కృషికి కృతజ్ఞతలు. ఈ గౌరవం కథను నమ్మిన మొత్తం బృందానికే చెందుతుంది. FNCC మరియు ETV విన్‌కు ధన్యవాదాలు’’ అని వేణు పోస్ట్ చేశారు. 

ఉత్తమ చిత్రంగా ‘కోర్ట్‌’: 

నాని నిర్మించిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఏ నోబడి’ మూవీ సూపర్ హిట్ అయింది. 2025 మార్చి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.56.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. రూ.10కోట్లలోపు బడ్జెట్‍తోనే రూపొందిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. 

కోర్టు నేపథ్యంలో వచ్చిన తెలుగు సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కోర్టు రూమ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కూడా అదే మాదిరి ఎత్తులు, పై ఎత్తులతో ఉత్కంఠగా సాగింది. చదువు గురించి, బతకడం గురించి అందరికి తెలిసిన, తెల్వకపోయిన చట్టాల గురించి తెలియాలి అనే చెప్పే కథ ఇది. చట్టం అనేది తెలియక ఎంతో మంది అమాయకులు చేయని నేరాలకు శిక్షను అనుభవిస్తున్నారని ఈ కోర్ట్ మూవీ అసలు కథ.

ఈ మూవీలో లవ్ స్టోరీతో పాటు, పోక్సో కేసు, కోర్టులో వాదనల చుట్టూ ఆసక్తికరంగా కథనం నడిపించాడు దర్శకుడు రామ్ జగదీశ్. డబ్బు బలంతో గవర్నమెంట్ అధికారులను లొంగదీసుకోవడం, చట్టంలోని లొసుగులని వాడుకోవడం కళ్ళకి కట్టినట్లుగా చూపించాడు డైరెక్టర్ రామ్ జగదీష్. చందు, శ్రీదేవి పాత్రల్లో నటించిన  హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి కథకు ప్రాణం పోశారు. తమలోని నటనను బయటకు తీశారు. మంగపతి క్యారెక్టర్ లో నటించిన శివాజీ ఈ మూవీతో ఒక సాలిడ్ కం బ్యాక్ ఇచ్చాడు. తనలోని సరికొత్త విలనిజం పరిచయం చేశాడు. ప్రియదర్శి తనలోని సహజమైన నటనతో మరోసారి మెప్పించాడు. కోర్టు రూమ్ లో వాదించిన తనశైలితో మెప్పించాడు. 

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ హ్యాట్రిక్ అవార్డ్స్:

'రాజు వెడ్స్ రాంబాయి'. కేవలం రూ. 2.5 కోట్ల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 22 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, ఎమోషనల్ చేసింది ఈ రూరల్ లవ్ స్టోరీ. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. 

కథ బ్యాక్ డ్రాప్:

వరంగల్, ఖమ్మం సరిహద్దుల్లోని ఒక పల్లెటూరు నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ ఇది. రాజు (అఖిల్) ఊర్లో బ్యాండ్ మేళం కొట్టే ఒక సామాన్య యువకుడు. అమాయకత్వం, నిజాయితీ కలిగిన వాడు. రాంబాయి (తేజస్వి రావు) రాజు నిజాయితీని మెచ్చి అతడిని ప్రేమిస్తుంది. అయితే రాంబాయి తండ్రి వెంకన్నకు తన కూతురిని ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చి పెళ్లి చేయాలనేది ఆశయం. ఒక సామాన్య బ్యాండ్ మేళం అబ్బాయికి తన కూతురిని ఇవ్వడానికి ఆయన అస్సలు ఒప్పుకోడు. మరి ఆ తండ్రిని ఒప్పించడానికి రాజు ఏం చేశాడు? పల్లెటూరి రాజకీయాలు, అక్కడి ఆచారాల మధ్య వీరి ప్రేమ ఎలా గెలిచింది? అనే అంశాలను దర్శకుడు చాలా సహజంగా తెరకెక్కించారు.

యదార్థ గాథలకు ప్రాణం పోసే దర్శకుడు వేణు ఊడుగుల (విరాటపర్వం ఫేమ్), రాహుల్ మోపిదేవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. చైతు జొన్నలగడ్డ, జనిత చౌదరి వంటి నటుల నటన ఈ సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చింది. మౌత్ టాక్ బాగుండటంతో తక్కువ స్క్రీన్లతో మొదలైన ఈ సినిమా, ఆ తర్వాత వందలాది థియేటర్లకు విస్తరించి మేకర్స్‌కు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. పల్లెటూరి మట్టి వాసన, స్వచ్ఛమైన హాస్యం, గుండెకు హత్తుకునే ఎమోషన్స్ కావాలనుకునే వారికి 'రాజు వెడ్స్ రాంబాయి' ఒక బెస్ట్ ఛాయిస్.