పత్తి ధరకు రెక్కలు: ఎన్నడూలేనంతగా మద్దతు ధర

పత్తి ధరకు రెక్కలు: ఎన్నడూలేనంతగా మద్దతు ధర

రాష్ట్రంలో పత్తి ధరకు రెక్కలు వచ్చాయి. గతంలో ఎన్నడూలేనంతగా పత్తికి మద్దతు ధర దొరుకుతుంది. రైతులు ఎక్కువగా వరిసాగు చేయడానికి ఆసక్తి చూపడంతో పత్తిసాగు తగ్గింది. వేసిన పంట కూడా వర్షాలకు దెబ్బతినడంతో దిగుబడి తక్కువగా వచ్చిందంటున్నారు రైతులు. అంతర్జాతీయంగా పత్తి నిల్వలు తగ్గిపోవడంతో మన దేశ పత్తికి డిమాండ్ పెరిగిపోయింది. గతంలో పత్తిని అమ్ముకోవడానికి కష్టాలు పడ్డ అన్నదాతలకు.. ఈసారి ఇదే పత్తి కాసుల వర్షం కురిపిస్తోంది.  వ్యాపారులే క్వింటాల్ పత్తిని 8 వేలకు కొంటున్నారు. 

ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ లో 8 వేల 20 రూపాయల మద్దతు ధరగా నిర్ణయించారు వ్యాపారులు. నెంబర్ వన్ క్వాలిటీ పత్తి కూడా మార్కెట్ కు తక్కువగానే వస్తుందంటున్నారు వ్యాపారులు. అందుకే మార్కెట్ వచ్చిన పత్తికి రికార్డు స్థాయి మద్దతు ధర దక్కుతుందని చెబుతున్నారు. 

గతంలో రైతులు పత్తిని తీసుకొచ్చి మార్కెట్ దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మార్కెట్ కు వచ్చిన పత్తి హాట్ కేక్ లా అమ్ముడుపోతోంది.  ఆదిలాబాద్ జిల్లా చరిత్రలో రికార్డు స్థాయిలో పత్తికి మద్దతు ధర లభించింది.  తేమ శాతం 8 వరకు క్వింటాలుకు 8వేల 20 రూపాయలు చెల్లించడానికి ముందుకొచ్చారు వ్యాపారులు. ఆపై నమోదయ్యే తేమ శాతానికి క్వింటాలుకు 80 రూపాయల చొప్పున కోత విధిస్తున్నారు. అయితే పత్తి ధర రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ... ఆదిలాబాద్ మార్కెట్ యార్డుతో పాటు జిన్నింగ్ మిల్లులన్నీ వెలవెలబోతున్నాయి. ఆదిలాబాద్ ట్రేడర్స్ కు పత్తిని అమ్మడానికి రైతులు ఆసక్తిగా లేకపోవడంతో.. మార్కెట్ యార్డు ఖాళీగా కనిపిస్తోంది. జిల్లాకు  సరిహద్దుల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో పత్తి కనీస మద్దతు ధర 8 వేల 100  ఉండగా... ఎలాంటి నిబంధనలు లేకుండా అక్కడి వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఎక్కువ మొత్తంలో జిల్లా రైతులు మహారాష్ట్ర కు వెళ్లి తమ పత్తిని అమ్ముకుంటున్నారు.

ఈసారి పత్తి కొనుగోళ్లకు తెలంగాణ ట్రేడర్స్ కు  మహారాష్ట్ర ఇతర ప్రాంతాల వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ కనబడుతోంది. ఆదిలాబాద్ జిల్లాకు సమీపంలో ఉన్న మహారాష్ట్రాలోని బోరీ, పాండ్రకవడ, అర్నీ, మాహోర్, పూసద్, కిన్వట్, ఘాటంజీ, వనీ, లాంటి ప్రాంతాల్లో ఇక్కడి ధర కంటే ఎక్కువ ధరను చెల్లిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయడంతో ఎక్కువ శాతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు మహారాష్ట్ర వైపు చూస్తున్నారు.