- రైతులకు అందని పట్టాదారు పాస్‌బుక్‌లు
- ధరణిలో కొంతమేరకే భూమి వివరాల డిస్ ప్లే
- 1,827 ఎకరాలకు నేటికీ అందని రైతుబంధు
మహబూబాబాద్/కేసముద్రం, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతుల కష్టాలు ఏండ్లు గడుస్తున్నా తీరడం లేదు. నాయకులు, ఆఫీసర్లు సమస్యలను పరిష్కరిస్తామని పలుసార్లు హామీలు ఇచ్చినా రైతులకు మాత్రం పట్టా పాస్‌బుక్‌లు అందట్లేదు. గ్రామానికి చెందిన1,200 మంది రైతుల 1,827 ఎకరాలను ఆఫీసర్లు భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రిజర్వ్ ఫారెస్ట్ కేటగిరిలో చేర్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రైతులకు పట్టాదారుపాస్ బుక్‌లు ఇచ్చేందుకు 11 నెలల క్రితం ఎంజాయ్ మెంట్సర్వే చేశారు. రైతులకు కొత్త పాస్‌బుక్‌లు మంజూరు చేస్తామని రెండు నెలల క్రితం మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. రైతులు ధరణిలో అప్లై చేసుకుంటే పాస్‌బుక్కులు ఇస్తామని చెప్పారు.
కానీ నేటికీ రైతులకు పాస్‌బుక్‌లు ఇవ్వలేదు. ధరణిలో పట్టాదారు పాసు పుస్తకాల డేటా కరెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న 149, 150, 154, 165 , 166,168 సర్వే నంబర్లలోగల రైతులకు 1,403 ఎకరాలకు వెంటనే పాస్ బుక్‌లు జారీ చేయాలని, అటవీశాఖ 5 జనవరి 2022న క్లియరెన్స్ ఇచ్చిన సర్వే నంబర్లు 116, 117, 151, 152, 164, 167లోని 202 ఎకరాలకు ఎంజాయ్ మెంట్ సర్వే చేసి పాస్ బుక్‌లు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 165వ సర్వే నంబర్ లో 60 సంవత్సరాలు సాగులో ఉండి, పట్టాదారు పాస్‌బుక్ కలిగి ఉన్న 150 ఎకరాలకు గతంలో ఎంజాయ్మెంట్ సర్వే చేసేటప్పుడు ఔట్ ఆఫ్ బౌండరీ అని వదిలిపెట్టారు. వాటికి సర్వే నంబర్లు గుర్తించి పాస్ బుక్‌లు ఇవ్వాల్సి ఉంది.
త్వరలో పాస్‌బుక్‌లు ఇస్తాం
జిల్లాలోని కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేయడం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గ్రామంలో ఇప్పటికే ఎంజాయ్ మెంట్ సర్వే నిర్వహించాం. గత భూ రికార్డుల ఆధారంగా కొత్త పాస్‌బుక్‌లు అందజేస్తాం. ఇప్పటికే ధరణిలో భూమి వివరాలు డిస్ ప్లే అవుతున్నాయి. కొంతమంది రైతులు తమకు సమస్యలను ఉన్నాయని చెబుతున్నారు. వాటిని వెరిఫై చేసి త్వరలో కొత్త పాస్‌బుక్‌లు అందిస్తాం. – కొమురయ్య, ఆర్డీవో, మహబూబాబాద్
