పాలిటెక్నిక్​లో 20 వేల 890 మందికి సీట్లు

పాలిటెక్నిక్​లో 20 వేల 890 మందికి సీట్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పాలిటెక్నిక్  కాలేజీల్లో ఫస్ట్  సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి విడతలో 72.21 శాతం సీట్లు నింపామని అధికారులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 113 పాలిటెక్నిక్  కాలేజీలు ఉండగా.. వాటిలో 28,931 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన పాలిసెట్ లో 69,728 మంది క్వాలిఫై అయ్యారు. దీంట్లో ఫస్ట్ ఫేజ్  అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 23,991 మంది వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. వారిలో 20,890 మందికి సీట్లు కేటాయించారు. 

57 సర్కారు కాలేజీల్లో 13,524 సీట్లకు గానూ 11,583 సీట్లు నిండాయి. 56  ప్రైవేటు కాలేజీల్లో 15407 సీట్లకు 9307 సీట్లు నిండాయి. కాగా, మూడు గవర్నమెంట్, ఒక ప్రైవేటు కాలేజీలో వంద శాతం సీట్లు స్టూడెంట్లకు అలాట్ అయినట్టు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, అడ్మిషన్ల కన్వీనర్  బుర్రా వెంకటేశం తెలిపారు. సీట్లు అలాటైన విద్యార్థులు ఈ నెల 4లోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు.